నల్లబెల్లి/గుండాల/దుమ్ముగూడెం, జూలై 7: యూరియా కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. వరంగల్, భద్రాద్రి జిల్లాల్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి సోమవారం రెండు లారీల యూరియా రావడంతో రైతులు ఉదయాన్నే గోదాం ఎదుట బారులు తీరారు. సిబ్బంది ఆధార్ కార్డును అప్లోడ్ చేస్తూ ఓటీపీ చెప్పిన రైతులకు మాత్రమే యూరియా ఇచ్చారు. ఒక్కో యూరియా బస్తాకు ఒక నానో యూరియా బాటిల్‌ను బలవంతంగా కట్టబెట్టారు. మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చి క్యూలో నిలబడి విసిగి వేసారి రేవంత్ సర్కారు వైఖరిపై దుమ్మెత్తి పోశారు.
నర్సంపేట, ఖానాపురం మండలాల్లోనూ యూరియా కోసం రైతులు బారులుతీరారు. కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, దుమ్ముగూడెం మండల కేంద్రాల్లోని సొసైటీ గోడౌన్ల వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు ఆధార్ కార్డులు వరుసలో పెట్టి యూరియా కోసం నిరీక్షించారు. ఆధార్‌తోపాటు వేలిముద్రలు తీసుకోవడంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నా సొసైటీ అధికారులు పరిష్కరించడం లేదని రైతులు మండిపడుతున్నారు. దుమ్ముగూడెంలోని లక్ష్మీపురం సొసైటీ గోడౌన్ వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్నా కొందరికి మాత్రమే బస్తాలు ఇవ్వడంతో.. మిగతావారు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ఆధార్ కార్డుకు ఒక్క బస్తా చొప్పున ఇస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.