Lagacharla | వికారాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ఫార్మా కంపెనీకి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని సర్కారుపై ఎదురుతిరిగిన రైతులు న్యాయపోరాటంలో బెయిల్ పొందారు. స్వేచ్ఛగా స్వగ్రామాలకు చేరినప్పటికీ రైతులను భయం వీడలేదు. ప్రభుత్వం మరో కేసులో అరెస్టు చేస్తుందని లగచర్ల పరిసర తండాల్లో ప్రచారం జరుగుతున్నది.
జైలుకెళ్లి బెయిల్‌పై వచ్చిన రైతులను పోలీసులు మళ్లీ అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ దుద్యాల మండల అధ్యక్షుడిపై దాడి కేసును పోలీసులు తెరపైకి తెచ్చే యోచనలో ఉన్నార ని సమాచారం. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది రైతుల కుటుంబాలు బిక్కుబిక్కుంటూ ఉన్నాయి.
ప్రభుత్వానికి ఎదురుతిరిగిన లగచర్ల, పోలేపల్లి, హకీంపేట, రోటిబండతండా, పులిచెర్ల కుంట తండాల్లో ప్రజలు భయం గుప్పెట్లో గడుపుతున్నారు. కుటుంబసభ్యులు జైలు నుంచి వచ్చారని ఆనందంగా ఉన్నప్పటికీ లోలోపల భయంతోనే బ్రతుకుతున్నారు. పోలీసులు మళ్లీ ఏ క్షణాన వచ్చి ఊర్లపై విరుచుకుపడుతారో అని ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమల కారిడార్‌కు ప్రభుత్వం 1278 ఎకరాలకు భూసేకరణ చేపట్టేందకు ప్రస్తుతం హకీంపేట, లగచర్ల, పోలేపల్లి గ్రామాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. ప్ర జాభిప్రాయ సేకరణ నిర్వహించకుండానే గు ట్టుచప్పుడు కాకుండా అధికారులు భూసేకరణ ప్రక్రియ చేపట్టారు.
జైలు నుంచి విడుదలైన రైతులు ఆత్మీయులను కలుసుకుని సాధకబాధకాలు చెప్పుకున్నారు. మాజీమంత్రి కేటీఆర్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సహకారంతో తమకు న్యాయం జరిగిందని కృతజ్ఞతలు తెలిపారు.