మల్లాపూర్, ఫిబ్రవరి 19 : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట పిల్లిగుట్ట ప్రాంతంలోని రైతులు సాగునీటి కోసం అరిగోస పడుతున్నారు. గ్రామ శివారులోని ఎస్సారెస్పీ ఉప కాలువ ద్వారా వచ్చే నీరు పెద్ద చెరువుకు చేరి అక్కడి నుంచి మళ్లీ కాలువ ద్వారా పొలాలకు అందుతుండేది. పదేండ్లుగా పుష్కలమైన జలాలతో రైతులు సంబురంగా పంటలు సాగు చేశారు. ఈ యాసంగిలో కెనాల్ ద్వారా చుక్క నీరు రాక, చెరువులో నీరు లేక తల్లడిల్లుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే కొద్ది రోజుల్లో వందలాది ఎకరాలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఊరి శివారుల రెండు ఎకరాల భూమి ఉంది. రూ.40 వేలు పెట్టుబడి పెట్టి వరి వేసిన. పొలం పొట్ట దశలోకి అచ్చింది. బావిలో నీళ్లు ఎల్లక పంట ఎండిపోతంది. మోటర్ పెడితే 40 నిమిషాలే నడిచి బావిల నీళ్లు లేక ఎత్తిపోతుంది. గతంల పెద్ద చెరువు నిండుగా ఉండి కాలువల ద్వారా నీళ్లు వచ్చేయి. ఇప్పుడు చెరువులో నీటి మట్టం తగ్గిపోయింది. బావులకు ఊటలు లేవు. రైతులను సర్కారు ఆదుకోవాలె. పదిహేను రోజులాయె పొలానికి నీళ్లు పెట్టక. కండ్ల ముందే పంట ఎండుతుంటే చూడబుద్ధి అయితలేదు. – జక్కుల రాజమల్లయ్య, రైతు, మొగిలిపేట
సరిగ్గా పసుపు ఆకు కోసి నెల దాటింది. ఇప్పటికి పారుకం నీళ్లు లేక పసుపును తవ్వలేదు. మొగిలిపేటలో నాలుగెకరాల భూమి ఉంది. ఇందులో రెండెకరాలు నువ్వులు, ఎకరం పసుపు వేసిన. మిగిలిన భూమిలో వరి నారుపోసిన. నీళ్లు సక్రమంగా అందక పొలాన్ని బీడు ఉంచిన. బావి పారుకంలో కరెంట్ మోటర్ పెడితే రోజు ఓ గంటకు పైగా నడుస్తున్నది. చెరువు నుంచి కాలువ ద్వారా నీళ్లు వస్తే అన్ని పంటలు పండేవి. గతంలో ఇంత నీటి కష్టం ఎప్పుడూ రాలేదు. సర్కార్, ఆఫీసర్లు పట్టించుకోని రైతుల సమస్యలను పరిష్కరించాలే. – ముక్కెర మల్లయ్య, రైతు, మొగిలిపేట