హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు అడ్డదిడ్డంగా గీసిన ట్రిపుల్ ఆర్ గీతలు చిన్న, సన్నకారు రైతుల పాలిట శాపంలా మారుతున్నాయని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అలైన్మెంట్ మార్పులను నిరసిస్తూ రోడ్డెక్కుతున్నారు. ఆందోళనలు చేపట్టేందుకు రాజధాని నగరానికి క్యూకడుతున్నారు. అలైన్మెంట్ మార్పులతో జీవనోపాధి కోల్పోతున్నామంటూ సోమవారం రైతులు హెచ్ఎండీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. పలు జిల్లాల నుంచి వచ్చిన రైతులు అధికారులను కలిసేందుకు ప్రయత్నించగా లోపలికి అనుమతించకుండా ఇన్వార్డ్ నుంచే వెనక్కి పంపిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ నోటిఫికేషన్‌ను హెచ్ఎండీఏ అధికారిక వెబ్సైట్లో ప్రచురించడంతో అసలు సమస్య మొదలైంది. గత అలైన్మెంట్ కాకుండా మార్పులు చేసిన మ్యాపులో గ్రామాల పరిధిలోని సర్వే నంబర్ల వారీగా జాబితా ప్రచురించడంతో హెచ్ఎండీఏ భూసేకరణ చేస్తున్నదని రైతులు భావిస్తున్నారు.
నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లా ల నుంచి రైతులు ఉదయాన్నే హెచ్ఎండీఏ కార్యాలయానికి చేరుకుని పాత అలైన్‌మెంట్‌తోనే ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు నిర్మాణం జరగాలని వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పాత అలైన్మెంట్ విధానంలోనే భూసేకరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దరఖాస్తులను కనీసం పరిశీలించడంలేదని మండిపడుతున్నారు. కాంగ్రెస్ సర్కారు తమ పొట్ట కొడుతున్నదని వాపోతున్నారు. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు కారణంగా చిన్న, సన్న కారు రైతులకే ఎక్కువ నష్టం ఉందని, ఉన్న కొద్దిపాటి భూమిని లాక్కుంటే జీవనోపాధి కోల్పోతామని కంటతడి పెడుతున్నారు.
దళితుల భూములే లక్ష్యమా?
దళితులు, బడుగు, బలహీనవర్గాల వ్యవసాయ భూములను లాక్కోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కారు ఆలైన్మెంట్ మార్పులు చేసిందని రైతులు మండిపడుతున్నారు. సంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన రైతులు పాత ఆలైన్మెంట్ ద్వారా కేవలం సర్కారు భూములు మాత్రమే ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులో కలుస్తుండేవని, ఆలైన్మెంట్ మార్చడంతో జిల్లా పరిధిలోని 5 మండలాల పరిధిలో కేవలం దళితులకు కేటాయించిన, సాగుపై జీవనోపాధినిచ్చే భూములు మాత్రమే ప్రాజెక్టులో పోతున్నాయంటూ సంగారెడ్డి జిల్లాకు చెందిన రైతులు మండిపడ్డారు. నిజానికి కాంగ్రెస్ సర్కారు ఆలైన్‌మెంట్‌లో మార్పులు చేయకపోతే వేలాది మంది చిన్న, సన్నకారు రైతుల భూములకు విలువతోపాటు, సాగు చేసుకునే అవకాశం ఉండేదని చెప్తున్నారు. కానీ ఉద్దేశపూర్వకంగా చేసిన మార్పులతో తమకు జీవనాధారమే లేకుండా పోతుందని విలపిస్తున్నారు.
చౌటుప్పల్ సమీపంలోని మర్రిగూడెం నుంచి వచ్చిన ఓ రైతు ఉదయాన్నే హెచ్ఎండీఏ కార్యాలయానికి వస్తే… సాయంత్రం వరకు అధికారులను కలిసేందుకు అనుమతించలేదు. వందలాది మంది రైతుల నుంచి తీసుకుంటున్న వినతిపత్రాలకు కనీస రక్షణ లేకుండా పోయిందని రైతులు చెప్తున్నారు. హెచ్ఎండీఏ స్టాంప్ వేసి పంపిస్తున్నారని, కనీస వివరాలు కూడా అందించడం లేదని వాపోతున్నారు. మరోవైపు, వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలంలోని చిట్టిగిద్ద, చంచల్పేట, దాదాపూర్, యావాపూర్ తదితర గ్రామాల ప్రజలు స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన తెలిపి ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ మాట్లాడుతూ ట్రిపుల్ ఆర్ నిర్మాణం వల్ల నిరుపేదలు సాగుభూములు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.