రామాయంపేట, జూన్ 7: వానలకు ధాన్యం తడిసి మొలకెత్తిందని, ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారంటూ రైతులు రోడ్డెక్కారు. ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం డీ ధర్మారంలో రామాయంపేట-గజ్వేల్ రహదారిపై గంటపాటు బైఠాయించారు. రెండు నెలలుగా తమ ధాన్యం రోడ్డుపైన, కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నదని, ఇంతవరకు తరలించడం లేదని అధికారులపై మండిపడ్డారు. మృగశిర కార్తె వచ్చిందని, మళ్లీ పంటలు వేసుకునే సమయం వచ్చినా చేతికి వచ్చిన ధాన్యం ఇంతవరకు పోలేదని, తాము మళ్లీ వ్యవసాయ పనులు ఎలా చేసుకోవాలని ఆవేదన వ్యక్తంచేశారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కొంతమంది రైతుల ధాన్యం తూకం వేశారని, ఇంకా వందల క్వింటాళ్లు కాంటాకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఎస్సై బాలరాజు వచ్చి తహసీల్దార్ రజినీకుమారితో ఫోన్లో మాట్లాడించడంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు