జనగామ రూరల్, ఫిబ్రవరి 28 : పంటలకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ జనగామ మండలం వడ్లకొండ గ్రామంలో శుక్రవారం రైతులు రోడ్డెక్కారు. హుస్నాబాద్-జనగామ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బొమ్మకూర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేస్తే చెరువులు, కుంటలు నిండితే పంటలకు చేరుతాయని అన్నారు. పొట్ట దశకు వచ్చిన పంటలకు నీళ్లిస్తే జీవం పోసినట్టు ఉంటుందని తెలిపారు. కండ్ల ముందు వేసిన పంటలు ఎండిపోతుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన చెందారు. లక్షల్లో అప్పు చేసి పంట వేస్తే నీరు లేక ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం గోదావరి జలాలు విడుదల చేస్తే ఉన్న పంటలైనా కాపాడుకుంటామని కోరుతున్నారు. రైతుల ధర్నాతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి రైతులతో చర్చించి ధర్నాను విరమింపచేశారు.