సూర్యాపేట, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : మోతె మండలానికి గోదావరి జలాలను తరలించేందుకు తూము గేటును మూసి వెల్డింగులు చేయడం ఆత్మకూర్ ఎస్ మండలంలో వెలుగులోకి వచ్చింది. గతంలో నాగార్జునసాగర్ ఎడమకాల్వ తూములన్నింటినీ మూసి వెల్డింగ్ చేసి ఖమ్మం జిల్లాకు నీటిని తీసుకుపోయిన ఆ జిల్లా మంత్రుల నిర్వాకాన్నే.. నేడు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి దంపతులు అమలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం ఆత్మకూర్.ఎస్ మండలం కోటినాయక్తండా వద్ద ఎస్సారెస్పీ కాల్వ తూము గేటును మూసి వెల్డింగ్ చేశారు. దీంతో నాలుగు రోజులుగా సాగునీటి సరఫరా లేదని దిగువన ఉన్న పెన్పహాడ్ మండలం రైతులు గగ్గోలు పెట్టినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు మంగళవారం తూము గేటు వెల్డింగ్ను పగులకొట్టి నీటిని మళ్లించారు. విషయం తెలుసుకొని వచ్చిన అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. గోదావరి జలాలపై ఆశలు పెట్టుకొని పంటలు సాగు చేస్తున్నామని, ఎస్సారెస్పీ నీళ్లు మోతెకు ఎలా తరలిస్తారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పలాయనం చిత్తగించారు. తాజాగా కోదాడ నియోజకవర్గం పరిధిలోని మోతె మండలానికి నీటిని తరలించడం కూడా మంత్రి పనేనని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.