నిర్మల్ జిల్లాలోని నీలాయిపేట్కు చెందిన రైతు కోట రాజన్న తనకున్న ఐదెకరాల్లో నీరు లేక రెండున్నరెకరాల్లో పంట సాగు చేశాడు. ఉన్న రెండు బోర్లలో ఒకటి మోటర్ కాలిపోయింది. మరో దాంట్లో నీరు కొద్దికొద్దిగా వస్తున్నది. దీంతో ఆ నీటిని జాగ్రత్తగా పట్టుకొని ఇలా తట్టలతో పంటను తడుపుతున్నాడు.
చెలిమ నీళ్లే దిక్కు
మంగపేట ; ములుగు జిల్లా మంగపేట సమీప అటవీ ప్రాంతంలోని శాంతినగర్, పోచమ్మగూడెం గొత్తికోయలు తాగు నీటికోసం అల్లాడుతున్నారు. అడవుల్లోని కాల్వలు ఎండిపోవడంతో సుమారు యాభై కుటుంబాలు నీటి కోసం గోసపడుతున్నాయి. పోచమ్మగూడెంలో ఉన్న ఒక్క బోరు నీరు సరిపోక సమీపంలోని గౌరారం వాగుకు వెళ్లాల్సి వస్తున్నది. అక్కడ చెలిమలు తవ్వి నీళ్లు తెచ్చుకుంటున్నారు.
పంటలు కాపాడాలని రైతుల రాస్తారోకో
చేర్యాల ; తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు గోదావరి జలాలు పంపింగ్ చేసి మిగిలిన పంటలను కాపాడాలని, ఇప్పటివరకు ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో రైతులు సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
అకాల వర్షంతో పంటలకు తీవ్రనష్టం
బెజ్జంకి ; అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో దెబ్బతిన్న పంటలను ఆయన సోమవారం పరిశీలించారు. రైతుభరోసా, రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. –