హైదరాబాద్, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు యూరియా కోసం అరిగోస పడుతున్నారని, కొరతతో అల్లాడుతున్నారని తెలంగాణ వికాస సమితి తెలిపింది. ఈ మేరకు యూరియా కొరత- రైతులు ఎదురొంటున్న ఇబ్బందులపై ఆచార్య కే సీతారామరావు, ఎర్రోజు శ్రీనివాస్, పులి రాజుతో కూడిన తెలంగాణ వికాస సమితి బృందం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన వివరాలను వెల్లడించింది. వర్గల్, గజ్వేల్, రాయపోల్, ములుగు మండలాల్లోని యూరియా విక్రయ కేంద్రాలు, గ్రామాలలో రైతుల అభిప్రాయాలు సేకరించింది. తాము సందర్శించిన ప్రతిచోటా భారీగా యూరియా కొరత ఉందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధ్యయన నివేదికలో సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలన కాలంలో యూరియా సమస్య లేదనే విషయం రైతులందరూ చెప్పారని తెలిపారు. అరక దున్నే సమయంలో ఆటో వాళ్లకు డబ్బులు ఇస్తే.. యూరియా తీసుకొచ్చి ఇంటి దగ్గర వేసేవారని, కానీ ఇప్పుడు యూరియా కావాలంటే రోజుల తరబడి లైన్లో నిలబడి, ముందుగా టోకెన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.
రోజులు, గంటల తరబడి లైన్లో నిలబడితేనే యూరియా బస్తాలు చేతికి రావడం లేదని వివరించారు. బయోమెట్రిక్ వల్ల పొలం పనులు వదిలేసి, యూరియా కోసం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు విలపిస్తున్నట్టు వివరించారు. వరి పిలకలు వేసే సమయంలో యూరియా వేయకపోతే గొలుసు సరిగ్గా రాదనే విషయం ఎక్కువ మంది రైతులు చెప్పినట్టు నివేదికలో పేర్కొన్నారు. దీనివల్ల పంట పండినా దిగుబడి భారీగా పడిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలంగాణ వికాస సమితి సభ్యులు తెలిపారు. కొందరు రైతులు పంటలను వదిలేసుకుంటున్నారని పేర్కొన్నారు. మక్క, పత్తి పరిస్థితి కూడా దయనీయంగానే ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో అసలు యూరియా సమస్యనే లేదన్నట్టు ప్రభుత్వ పెద్దలు మాట్లాడటం సరికాదని వికాస సమితి సభ్యులు అన్నారు. రైతులకు కరెంటు సమస్య కూడా తీవ్రంగా ఉందని, గతంలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ కరెంటు సమస్య తలెత్తలేదని చెప్పారు. ఒకవేళ వచ్చినా విద్యుత్తు అధకారులకు ఫిర్యాదు చేసి, ట్రాక్టర్లో ట్రాన్స్ఫార్మర్ పంపిస్తే పునరుద్ధరణ జరిగేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వాపోయారు.