ఏటూరునాగారం, అక్టోబర్ 6 : అటవీ అధికారుల తీరుపై పోడు రైతులు భగ్గుమన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి రోడ్డు పక్కనే ఉన్న పోడు భూమిలో అటవీ అధికారులు సోమవారం తుమ్మ మొక్కలు నాటుతుండగా రైతులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు రైతులు, అటవీశాఖ అధికారుల మధ్య తోపులాట జరిగింది. ఇక్కడి పోడు భూమి వ్యవహారం కొన్నేండ్లుగా వివాదాస్పదంగా ఉన్నది. అనేక సార్లు రైతులు, అటవీశాఖ అధికారుల మధ్య గొడవకు దారితీసింది. ఇటీవలే అటవీశాఖ అధికారులు గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేసి ఫలసాయం మొక్కలు నాటించేందుకు ఒప్పించారు. వీటి ఫలితాలు రైతులు పొందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
దీంతో వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన ఫలసాయం మొక్కలు నాటారు. కాగా, ఇదే పోడు భూమిలో అధికారులు సోమవారం తుమ్మ మొక్కలు నాటుతున్న క్రమంలో రైతులు, గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో రైతులు జాతీయ రహదారిపై బైఠాయించారు. పోలీసులు జోక్యం చేసుకుని ధర్నాను విరమింపజేశారు. నాటుతున్న మొక్కలను రైతులు అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా అటవీశాఖ అధికారులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. ముందు హామీ ఇచ్చి ఎలా తప్పుతున్నారంటూ అధికారులను నిలదీశారు. ప్రస్తుతం 20 ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటగా మరో 50 ఎకరాల్లో కొంత మేరకు తుమ్మ మొక్కలు నాటేందుకు యత్నిస్తుండగా వివాదం రాజుకున్నది. అయితే చిన్నబోయినపల్లి రైతులు మాత్రం మొక్కలు నాటొద్దని డిమాండ్ చేస్తున్నారు.