పరకాల, ఏప్రిల్ 9 : బ్యాంకు అధికారులు తమ ఖాతాలను ఫ్రీజ్ చేయడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. తమకు ఖాతాల్లో జమ అవుతున్న రైతు భరోసా, ఉపాధి హామీ డబ్బులను డ్రా చేసేందుకు బ్యాంక్‌కు వెళ్తే వ్యవసాయ రుణాలు చెల్లిస్తేనే నగదు ఇస్తామని బ్యాంకు అధికారులు అంటున్నారని, ఇందేదని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నడికూడ మండలం నార్లపూర్, వరికోల్ గ్రామాలకు చెందిన ఇరువై మంది రైతులు ఖాతాల్లో ఉన్న డబ్బులను డ్రా చేసుకునేందుకు గురువారం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌కు వచ్చారు.
ఈ క్రమంలో బ్యాంక్ అధికారులు ఖాతాలు ఫ్రీజ్‌లో ఉన్నాయని, డబ్బులు డ్రా చేసుకోవడం వీలుకాదని సమాధానమిచ్చారు. మేనేజర్‌ను ప్రశ్నించగా వ్యవసాయ రుణం చెల్లించకపోవడంతో ఖాతాలు ఫ్రీజ్ చేశామని, వెంటనే రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ఆగ్రహించిన రైతులు బ్యాంక్ ఎదుట ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతోనే వ్యవసాయ రుణాలు చెల్లించలేదని, రుణమాఫీ చేస్తే తమకు ఈ ఇబ్బందులు తప్పేవని, తమను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని దుమ్మెత్తిపోశారు.
నాకు పరకాలలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.లక్షకు పైగా వ్యవసాయ రుణం ఉన్నది. రుణం మాఫీ అవుతుందని రెన్యువల్ చేసుకోలేదు. నా ఖాతాలో రూ.50 వేలకు పైగా డబ్బులు నిల్వ ఉన్నాయి. నా మనుమరాలికి ముక్కు, చెవ్వులు కుట్టించాలి. తాతగా ఎంతోకొంత బంగారం పెట్టాలే కదా? అందుకోసం డబ్బులు విడిపించుకునేందుకు బ్యాంక్‌కు వస్తే నా ఖాతా పని చేస్తలేదని చెప్పారు. ఎందుకని అడిగితే వ్యవసాయ రుణం రెన్యువల్ చేసుకోలేదని, ఖాతాను బ్యాంకు అధికారులు ఆపేసిన్రట. నా డబ్బులు నాకే ఇస్తలేరు. బ్యాంక్‌కు బాకీపడ్డ డబ్బులు కట్టేవరకు నా ఖాతాను ఫ్రీజ్ చేసిన ప్రభుత్వం, మాకు రుణమాఫీ చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి బాకీ పడలేదా మరి. మా బాకీ డబ్బులు కోసం మేమెవ్వరిని అడగాలె? నిలదీయాలే? గిదేందో అర్థంకావడం లేదు.
– శనిగరం మొగిలి, రైతు నార్లపూర్, నడికూడ మండలం