Telangana | సమస్యల చక్రబంధంలో చిక్కుకుని తెలంగాణ రైతు విలవిలలాడుతున్నాడు. చేష్టలుడిగిన సర్కారు కారణంగా పొట్టదశలోనే పంటలు ఎండుతున్నాయి. ఎస్సారెస్సీ వరదకాలువ పక్కన.. సూర్యాపేట చివరి ఆయకట్టు కొసన.. గోదావరి పరీవాహకంలో.. ఎగువ మానేరు దిగువన.. దేవాదుల దరిదాపున.. అన్నిచోట్లా ఒకే వికలదృశ్యం. కండ్లముందే ఎండుతున్న పంటలను కాపాడుకోవడం కోసం ఒక్కొక్కరిది ఒక్కో భగీరథ యత్నం. ఓ రైతు రోజుకు 8 ట్యాంకర్ల నీళ్లు తెచ్చి చేను తడుపుతుంటే.. మరొకరు రెండు నెలల్లో ఆరుబోర్లేసి ఆపసోపాలు పడుతున్నాడు. వరి సాగుదారులకే కాదు.. పాడి రైతు నుంచి పసుపు రైతు వరకు అందరిదీ ఒకే అరిగోస. పసుపు మద్దతు ధర కోసం నిజామాబాద్, మెట్పల్లి రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని పాలమూరు పాడిరైతు పోరుబాట పట్టాడు. అన్నదాతకు ఎన్ని వెతలో! ఈ వేదన ఇంకెన్ని రోజులో!
పసుపు రైతుల మెరుపుధర్నా
పసుపు పంటకు మద్దతు ధర చెల్లించాలని నిజామాబాద్‌లో రైతులు సోమవారం మెరుపుధర్నాకు దిగారు. ముందుగా మార్కెట్ యార్డు కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి బస్టాండ్ ఎదుట బైఠాయించారు. పసుపుబోర్డు పేరుతో కేంద్రం తమను దగా చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తమను మోసం చేసిందని మండిపడ్డారు. రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడ్డారని తెలిపారు. మార్కెట్ యార్డుకు పసుపు తీసుకొచ్చి వారం రోజులు గడుస్తున్నా కొనడంలేదని పసుపు రైతులు వాపోయారు. అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై తమను దోచుకుంటున్నారని మండిపడ్డారు.
రోజుకు 8 ట్యాంకర్ల నీళ్లు
రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవి పదిరకు చెందిన యువరైతు బైరి సాయి చిరంజీవి రెండెకరాల 30 గుంటల్లో వరి పంట వేశాడు. మరో పది రోజుల్లో పంట చేతికొస్తుందనుకున్న సమయంలో రెండు బోర్లు ఎత్తేశాయి. దీంతో మూడు రోజులుగా సమీప చెరువులోంచి రోజుకు రూ.వెయ్యికి ఒక ట్యాంకర్ చొప్పున 8 ట్యాంకర్ల నీళ్లు పెడుతున్నాడు. అయినప్పటికీ ఎకరం పొలం ఎండిపోయేటట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘సేసెతానికి ఇక్కడ పనిలేక మా నాన్న నెల కిందట దుబాయ్ పోయిండు.. నేను కూడా ఇగదుబాయ్కు పోవాల్సి వస్తదేమో..’ అని యువరైతు బైరి సాయి చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశాడు.
రెండు నెలల్లో ఆరు బోర్లు..
ఖలీల్‌వాడి ; నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాస్బాగ్తండాలో రైతు అఖిలేశ్ 6 ఎకరాల్లో వరి సాగుచేశాడు. చెరువులు ఎండిపోయి బోర్లు బిక్కడంతో పంట ఎండిపోతున్నది. దీంతో పంటను కాపాడేందుకు సదరు రైతు రెండు నెలల్లో ఆరు బోర్లు వేయించాడు. ఒక్కో బోరు వెయ్యి ఫీట్లకు పైగా వేసినా నీటి జాడ కనిపించలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. కొద్దిపాటి నీరైనా వస్తుందనే ఆశతో కుటుంబసభ్యులతో కలిసి బోరులో మోటర్ దింపినా ఫలితం దక్కలేదని వాపోయాడు. ఇదే మండలంలోని గుడితండాలో నగేశ్ అనే రైతు తన పొలం ఎండిపోవడంతో పొలాన్ని మేకల మేత కోసం వదిలేశాడు.
పంట ఎండుతున్నా పట్టదా?
గంగాధర ; ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు సాగు నీరందక రైతులు ఆగమవుతున్నారని, పొలాలు ఎండుతున్నా కాంగ్రెస్ సర్కారుకు పట్టదా? అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు. సోమవారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తిలో ఎండిపోయిన పంటపొలాలను ఆయన పరిశీలించి, రైతులతో మాట్లాడారు. సాగు నీరందక కండ్లముందే పంటలు ఎండిపోతున్నా పట్టించుకునేవారే లేరని, రైతుల పరిస్థితి అరణ్య రోదనగా మారిందని దుయ్యబట్టారు. రూ.20 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సాగునీటి కోసం విస్సంపల్లి రైతుల నిరసన
చిన్నగూడూరు ; మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం నుంచి ఎస్సారెస్పీ కాల్వ ద్వారా వస్తున్న నీటికి బాల్యతండా రైతులు అడ్డుకట్ట వేసి తమ గ్రామానికి నీరు రాకుండా చేస్తున్నారని చిన్నగూడూరు మండలం విస్సంపల్లి రైతులు ఆరోపించారు. దీంతో విస్సంపల్లి, తుమ్మలచెరువులో వరి పొలాలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ డీఈ రాజ్‌కుమార్ ఎస్సారెస్పీ కాల్వ పరిశీలనకు వచ్చారని, ఆయనకు సమస్యను వివరిస్తున్న క్రమంలో బాల్యతండా రైతులు అక్కడికి వచ్చి వాగ్వాదానికి దిగినట్టు తెలిపారు. దీంతో సమస్యను పరిష్కరించకుండానే అధికారి వెళ్లిపోయారని, ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని విస్సంపల్లి రైతులు డిమాండ్ చేశారు.
రేవంత్‌కు ఎద్దు.. ఎవుసం తెలియదు
ఆలేరు టౌన్ ; పంటలు ఎండి రైతులు గోస పడుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎద్దు.. ఎవుసం తెలియదని నల్లగొండ డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శివలాల్ తండాలో ఎండిన పంటను సోమవారం ఆయన పరిశీలించారు. గిరిజన మహిళా రైతులు ధరావత్ నీలమ్మ, పద్మమ్మ, ధరణిమ్మ, బాలమ్మ నీళ్లు లేక తమ పంటలు ఎండిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం బాగుందని చెప్పారు.
రైతుల దీక్షకు రసమయి మద్దతు
ఇల్లంతకుంట ; సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో రైతులు వారం రోజులుగా చేస్తున్న దీక్షకు మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ సంఘీభావం తెలియజేశారు. సోమవారం ఆయన దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాలకు చెందిన ఆరు గ్రామాల రైతులు దీక్షలో కూర్చున్నారు. రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. సాగునీరు విడుదల చేసే వరకూ రైతులకు బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుందని హామీ ఇచ్చారు. అన్నపూర్ణ, రాజరాజేశ్వర ప్రాజెక్టుల్లో నిండు కుండలా నీళ్లున్నా మండలంలోని పంటలు ఎందుకు ఎండుతున్నాయని ప్రశ్నించారు. ఎమ్మెల్యే నిర్లక్ష్యంతోనే నీళ్లు రావడం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్‌చైర్మన్ సిద్ధం వేణు, సెస్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
ఎస్సారెస్పీ కాల్వకు గండి
కురవి ; మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోదులగూడెం సమీపంలోని రేగులకుంటలోకి నీటిని తరలించేందుకు ఆదివారం రాత్రి తండాకు చెందిన గుర్తుతెలియని వ్యక్తులు ఎస్సారెస్పీ కాల్వకు గండి పెట్టారు. దీంతో వరద బయటకు ఒక్కసారిగా రావడంతో 10ఎకరాల మామిడి తోట, వరి పొలానికి నష్టం వాటిల్లింది. అధికారులు గండి పడిన ఎస్సారెస్సీ కాల్వను పూడ్చకపోవడంతో నీరంతా వృథాగా పోతున్నది. దీంతో నీటి పారుదల శాఖ అధికారులు గండిని పూడ్చాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు.
రామప్ప సరస్సు ఒగరు కాల్వకు బుంగ
వెంకటాపూర్ ; ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప సరస్సు ప్రధాన కాల్వ ఒగరు కాల్వకు ఆదివారం రాత్రి బుంగ పడి నీరు వృథాగా పోతున్నది. దీంతో సమీపంలోని పంటపొలాలు నీటిలో మునిగాయి. సోమవారం విషయం తెలుసుకున్న నీటి పారుదల శాఖ అధికారులు డీఈ రవీందర్, ఈఈ నారాయణ, ఏఈ జయంతి పరిశీలించి తూములకు నీటి సరఫరా నిలిపివేశారు. త్వరలో మరమ్మతు చేసి పంటపొలాలకు నీరు అందిస్తామని తెలిపారు.
నీరందక ఎండుతున్న పొలాలు
వేలేరు/ధర్మసాగర్ ; హనుమకొండ జిల్లా వేలేరు పెద్దచెరువు తూము నుంచి సాగు నీరందక పంట పొలాలు ఎండుతున్నాయని వేలేరు మండలం ఎర్రబెల్లి, బండతండా, ధర్మసాగర్ మండలం ముప్పా రం, నారాయణగిరి రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వేలేరు పెద్దచెరువు తూము నుంచి ప్రతియేటా సాగునీరందించే వారని, ఈ ఏడాది ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయలేదని చెబుతున్నారు. దీనిపై అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.