Runa Mafi | తొగుట, ఆగస్టు 31 : రుణమాఫీ ఏమో కానీ రెన్యువల్ చేసుకోవడానికి రైతులు అవస్థ పడుతున్నారు. రోజూ బ్యాంకు వద్దకు వెళ్లి నిరీక్షించినా తమవంతు వస్తలేదని టోకెన్ల కోసం రాత్రిపూట బ్యాంకు వద్దే నిద్రిస్తున్నారు. ఈ విచిత్ర పరిస్థితి సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని ఏపీజీవీబీ వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. తొగుట మండల కేంద్రంలోని ఏపీజీవీబీలో రుణాల రెన్యువల్‌కు వారానికి ఒక గ్రామం చొప్పున బ్యాంకు సిబ్బంది సేవలు అందిస్తున్నారు.
ఈ బ్యాంకులో ఒకరే ఫీల్డ్ ఆఫీసర్ ఉండటంతో మేనేజర్ సహకరిస్తున్నా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి రావడం, సర్వర్ సమస్యలతో రోజుకు 25 నుంచి 30 మందికి మాత్రమే రెన్యువల్ అవుతున్నాయి. బ్యాంకు చుట్టూ తిరిగినా తమ నంబర్ రాకపోవడంతో విసిగి వేసారిన రైతులు విధిలేక రాత్రిళ్లు బ్యాంకు వద్దకు వచ్చి లైన్ కడుతున్నారు. బ్యాంకు పాస్‌బుక్, ఆధార్, 1బీ సర్టిఫికెట్లతో క్యూలో పెడుతున్నారు. లైన్ వెనుకా ముందు అవుతుందనే భయంతో నిద్రాహారాలు మాని అక్కడే నిరీక్షిస్తున్నారు. మహిళలు సైతం ఇబ్బందులు పడుతూ బ్యాం కు వద్ద రాత్రిళ్లు నిద్రిస్తున్నారు.
ఉదయం బ్యాంకు అధికారులు వచ్చే వరకు అక్కడే ఉండి వారి ద్వారా టోకెన్ తీసుకుంటున్నారు. ఎంతమంది రైతులున్నా 30 మందికే టోకె న్లు ఇస్తూ, మిగతా వారికి వేరే తేదీ కేటాయిస్తున్నారు. రుణమాఫీ ఏమిటో కానీ బ్యాంకుల చుట్టూ తిరిగి వేసారి పోతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. కాంగ్రెస్ పాలనలో తమకెప్పుడూ కష్టాలు.. కన్నీళ్లేనని ఆవేదన చెం దుతున్నారు. గతంలోనూ రాత్రి కరెంట్ కోసం పొలానికి వెళ్లి నీరు పారించుకునేవారమని, కరెంట్ ఎప్పుడొస్తదా అని అక్కడే ఉండి నిరీక్షించేవారమని పేర్కొంటున్నారు.