చిన్నశంకరంపేట, మే 21: రైతులు అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి సూచించారు. గురువారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అగ్రహారంలో వడ్లు కొనేవారులేక ఆత్మహత్య చేసుకున్న రైతు రాజయ్య కుటుంబాన్ని ఆమె పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని, ప్రభుత్వంతో పోరాడి పరిష్కరించుకోవాలని సూచించారు. రైతు రాజయ్య ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ధాన్యా న్ని కొనుగోలు చేస్తే రాజన్న ఆత్మహత్య చేసుకునేవాడు కాదన్నారు. కొనుగోలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.