హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ 11 నెలల పాలనలో తెలంగాణ రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది. మొన్నటిదాకా కురిసిన వానలతో వేసిన పంట దెబ్బతిడం, ఇటు రైతుభరోసా ఎగ్గొట్టి సర్కారు దగా చేయడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నది. చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేం ద్రాల ఏర్పాటులోనూ జాప్యం చేస్తుండడం తో దళారులకు తెగనమ్ముకుంటూ బోరుమంటున్నది. వానలతో మెత్తబడ్డ పత్తికి మద్దతు ధర దక్కే అవకాశం లేకపోవడంతో అప్పుల భారం పెరిగిపోయి కుదేలవుతున్నది.
ఇగ కొనేవారు దిక్కులేక పండించిన మక్క ఇండ్లలోనే ముక్కిపోతుండడంతో గగ్గొలు పెడుతున్నది. ఈ వానకాలం సీజన్ తెలంగాణ రైతులకు కలసిరాలేదు. కాళేశ్వరం నీళ్లు విడుదల చేయకపోవడం, సకాలంలో వానలు కురువకపోవడం, సర్కారు నుంచి పెట్టుబడి సాయం అందకపోవడంతో పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. గతేడాదితో పోల్చితే సుమారు 5 లక్షల ఎకరాల్లో ఈ సారి ఎలాంటి పంటలు వేయలేదు. సాగు చేసిన తర్వాత వరుసగా తుపాన్లు విరుచుకుపడడంతో పంటలకు అ పార నష్టం వాటిల్లింది. సర్కారు కొందరు రైతులకు మాత్రమే ఎకరాకు రూ. 10 వేల చొప్పున అందించి చేతులు దులుపుకున్నది.
అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు పంటలకు ఎకరాకు రూ. 15 వేల రైతుభరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పూటకో ప్రకటనతో రైతులను మోసం చేస్తున్నది. నిధుల్లేవనే సాకుతో యాసంగి పంటకు గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధుతో సరిపెట్టింది. అదికూడా ఐదు నెలలుగా సాగదీసి పంటలు చేతికొచ్చే సమయంలో ఖాతాల్లో జమ చేసింది. ఈ వానకాలం పంట నుంచే రైతుభరోసా ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సభల్లో ఊదరగొట్టారు. అసెం బ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి మార్గదర్శకాలు రూపొందిస్తామని పేర్కొన్నారు.
కానీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో ఈ ఊసే ఎత్తలేదు. ఆ తర్వాత రైతురుణమాఫీ కారణంగా నిధుల కొంత ఆలస్యం జరుగుతుందని వానకాలం పంటకు రైతుభరోసా పక్కాగా ఇస్తామని నమ్మించారు. జూలై 2న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశా రు. రాష్ట్రంలోని పలు ప్రాంతా ల్లో పర్యటించి, రైతులు, వ్యవసాయరంగ నిపుణుల అభిప్రాయాలను సమీకరించి 15 రోజుల్లో నివేదిస్తామని పేర్కొన్నారు. సబ్‌కమిటీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మొక్కుబడిగా పర్యటించింది. రైతులతో తూతూమంత్రపు సమావేశాలు నిర్వహిం చి హంగామా చేసింది. రేపు, మాపు అంటూ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటనలు చేశారు.
సెప్టెంబర్ 18న రైతుభరోసాను కౌలు రైతులకు ఇవ్వబోమని చెప్పారు. ఈ విషయంలో కౌలుదారులు, రైతులే తేల్చుకోవాలని స్పష్టంచేశారు. తర్వాత చాలా రుణమాఫీ చేసిన వెంటనే ఇస్తామంటూ రైతులను ఆశల్లో ముంచెత్తారు. తీరా ఈ సీజన్‌కు భరోసా ఇవ్వబోమని చావు కబురు చల్లగా చెప్పి నిండా ముంచారు.
ఇక రైతుభరోసా తరహాలోనే పంటలకు బోనస్ విషయంలోనూ ప్రభుత్వం నాలుక మడతేసింది. ఎన్నికల టైమ్‌ల అన్ని వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ నమ్మబలికింది. రైతు డిక్లరేషన్‌లో రాహుల్‌గాంధీతోనూ చెప్పించింది. వానకాలం పంటల సమయంలో దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వలేమని చేతులెత్తేశారు. సన్న రకాల్లోనూ కొన్నింటికే ఇస్తామని మెలికపెట్టారు. ఇప్పటికైతే గింజ ధాన్యానికి కూడా ఎక్కడా బోనస్ ఇచ్చిన దాఖలాలు కనిపించలేదు.
ఈ ఏడాది పత్తిపంటను రైతులు 4.32 ఎకరాల్లో సాగు చేశారు. వాతావారణ అననూకూలతలతో ఆశించిన మేర దిగుబడి రాలేదు. వచ్చిన కొద్దిపాటి పంట కూడా తేమశాతం పెరుగుతుండడంతో రైతులు దళారులకు సగటున క్వింటాల్‌కు రూ. 5000 చొప్పున అమ్ముకున్నారు.ఆ తర్వాత సీసీఐ ద్వారా కొనుగోళ్లు ప్రారంభించింది. అయితే పత్తిలో నిర్ణీత తేమ శాతం 8 కంటే ఎక్కువ ఉండడంతో రైతులకు కనీస మద్దతు ధర రూ. 7,521 దక్కడం అనుమానమే. అలాగే 100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, మక్కలను కొనుగోలు చేస్తామని చెప్పిన అధికారు లు ఇప్పుడు ఆచరణలో విఫలమయ్యారు. కేవలం ఒకటి రెండు సెంటర్లు తెరిచి మమ అనిపించారు.
రుణమాఫీ అమలు విషయంలోనూ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. రూ. 2లక్షల వరకు లోన్లను ఆగస్టు 15లోగా ఒకే విత మాఫీ చేస్తామని చెప్పి ఇప్పటికీ సగం మందికి మాత్రమే చేశారు. మిగిలినవారు బ్యాంకులు, అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. తాజాగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు దీపావళిలోగా మరో 4 లక్షల మంది రైతులను రుణవిముక్తుల్ని చేస్తామని ప్రకటించారు. పండుగ అయిపోయినా చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. అసలు రుణాల మాఫీకి ఎంత సమయం పడుతుందో అర్థం కావడంలేదు. మొత్తంగా అన్నదాతలను ప్రకృతి పగబడితే సర్కారు దగా చేసింది