Yacharam | యాచారం, ఏప్రిల్ 24: ‘ఇది మా భూమి. మాకేమైనా మీ ప్రభుత్వమిచ్చిందా, నువ్విచ్చినవా? మాకు చెప్పకుండా మాభూముల్లోకి ఎందుకొచ్చిండ్రు? మా భూమిలో సర్వే చేయొద్దు. మర్యాదగా వెళ్లి పోండి. మంచితనంగా ఇక్కడి నుంచి వెళ్లకపోతే సర్వే మిషన్లు పగుల గొడతాను. ఇవీ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లికి చెందిన కాస ఎట్టయ్య అధికారులకు తేల్చిచెప్పిన మాటలు. వివరాల్లోకి వెళ్తే గురువారం ఫార్మా కంపెనీల పేరుతో అధికారులు, పోలీసులు మరోసారి సర్వేకు దిగడం ఉద్రిక్తంగా మారింది. ఫార్మాకు భూములు ఇచ్చే ప్రసక్తేలేదంటూ కోర్టు స్టే తెచ్చుకున్న రైతుల భూముల్లోకి అధికారులు వెళ్లడం ఇందుకు కారణమైంది. సర్వే నంబర్ 408లోని మంజుల పేరుమీదున్న భూమిలోకి రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులు, పోలీసులు సర్వే చేసేందుకు వెళ్లారు.
ఫెన్సింగ్ వేసేందుకు యత్నించారు. అక్కడ హద్దు రాయి కూడా వేశారు. విషయం తెలుసుకున్న మంజుల తండ్రి ఎట్టయ్య అక్కడికి చేరుకొని సర్వేను అడ్డుకున్నాడు. హద్దు రాయిని తొలగించాడు. దమ్ముంటే సర్వే మిషన్లు పగులగొట్టు అంటూ పోలీసులు రైతుతో వాగ్వాదానికి దిగారు. దీంతో నువ్వసలు మా భూమిలకెందుకొచ్చినవో ముందు అది చెప్పు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలోకి రాబోమని చెప్పి, మళ్లీ ఎందుకొచ్చిండ్రు? అంటూ రైతు ఎట్టయ్య మండిపడ్డాడు. దీంతో సర్వే ఏమీ చేయడంలేదని, సర్వే నంబర్ చెక్ చేసేందుకు వచ్చామంటూ అధికారులు, పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోసారి తమ భూముల్లోకి వస్తే ప్రస్తుతం చేపడుతున్న ఫెన్సింగ్ పనులను అడ్డుకుంటామని రైతు హెచ్చరించాడు.