గార్ల, జనవరి 19 : మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలోని దుబ్బగూడెం వద్ద పాకాల ఏటిపై అడ్డంగా నిర్మించతలపెట్టిన పాలేరు లింకు కెనాల్ సర్వేను ముల్కనూర్, దుబ్బగూడెం రైతులు అడ్డుకున్నారు. సోమవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు తహసీల్దార్ శారదతోపాటు సర్వే బృందం దుబ్బగూడెంకు వచ్చి సర్వే చేస్తుండగా 100 మంది రైతులు మూకుమ్మడిగా వచ్చి తమ భూముల గుండా కాల్వలు నిర్మించడానికి అంగీకరించమని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూమి తక్కువ ఉన్న రైతుల పొలాలు సర్వేలోపోతే వారు పట్టణాలకు వలస పోవాల్సిన దుస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన నియోజకవర్గం కోసం జీవో 98 విడుదల చేసి, రూ.162.56 కోట్లతో పాలేరుకు నీళ్లు తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రాణాలైన ఇస్తాం.. కానీ తమ భూ ములు లింక్ కెనాల్‌కు ఇవ్వమని భీష్మించారు. తనకున్న 30 గుంటల భూమి ఈ కెనాల్లో పోతున్నదని, కాల్వ నిర్మాణం ఆపాలని రైతు చిన్నా డీఎస్పీ తిరుపతిరావు కాళ్లు మొక్కి వేడుకున్నాడు. తనకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తహసీల్దార్‌తో పాటు సర్వే బృందం వెనుదిరిగింది.