నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 29 : ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులు చేపడుతున్న ఆందోళనలు ఉధృతరూపం దాల్చుతున్నాయి. శుక్రవారం కూడా అనేకచోట్ల రైతులు రోడ్లెక్కారు. మెదక్, జనగామ, హనుమకొండ జిల్లాల్లో రైతులు ఆత్మహత్యకు యత్నించారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. వివరాలు ఇలా.. కొనుగోలు కేంద్రంలో కాంటా పెట్టడం లేదని మెదక్ జిల్లా చేగుంట మండలం సాల్కొని చెర్వు తండాకు చెందిన రైతు రాట్ల భిక్షపతి శుక్రవారం రాత్రి గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు.

భిక్షపతి వారం రోజుల క్రితం మక్కరాజిపేటలోని కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాడు. అకాల వర్షాలు కురుస్తుండటం, ధాన్యం కాంటా ఆలస్యం అవుతుండటంతో రెండు, మూడు రోజులుగా తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. శుక్రవారం రాత్రి కొనుగోలు కేంద్రం వద్ద గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే 108 వాహనంలో తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. భిక్షపతికి చెందిన సీరియల్ 115 కాగా, ప్రస్తుతం 88 నడుస్తున్నదని, అతని సీరియల్ రాగానే కాంటా పెడుతామని రైతుకు చెప్పినట్టు నిర్వాహకులు పేర్కొన్నారు.

ధాన్యం కొనడం లేదని, కాంటా పెట్టిన బస్తాలను మిల్లులకు తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మార్కెట్ ప్రధాన గేటు వద్ద వడ్ల బస్తాలకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఓ రైతు పెట్రోల్ బాటిల్ తీసి ఆత్మహత్యకు యత్నించగా అధికారులు, రైతులు అడ్డుకున్నారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం మడిపల్లిలో ఐకేపీ సెంటర్ నిర్వాహకులు మూడు రోజుల క్రితం కాంటా పెట్టిన వడ్లను మిల్లుకు తరలించకపోవడంతో మనస్తాపానికి గురైన రైతు ముంజ శ్రీనివాస్‌గౌడ్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

గమనించిన రైతులు వెంటనే శ్రీనివాస్ ఒంటిపై నీళ్లు పోయడంతో ప్రాణాపాయం తప్పింది. కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండలగూడెంలో రైతులు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. నెల దాటినా 30 శాతం ధాన్యం మాత్రమే కాంటా వేసి మిల్లులకు తరలించడంపై మండిపడ్డారు. వీరి ఆందోళనలకు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. రెండు నెలలైనా కొనకపోవడాన్ని నిరసిస్తూ యాదాద్రి జిల్లా గుండాలలో ధాన్యానికి నిప్పు పెట్టారు. తూకం వేస్తున్న బస్తాలకు ట్రక్‌షీట్ ఇచ్చినా మిల్లర్లు అడ్డగోలుగా తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో కొలనుపాక- సిద్దిపేట రహదారిపై బీఆర్ఎస్ నాయకులు, రైతులు ధర్నా చేశారు.

వడ్లు తరలించేందుకు లారీలు రాకపోవడంతో ధాన్యం నిలిచిపోయిందని ఆరోపించారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హామీ ఎక్కడికి పోయిందని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోలులో సర్కార్ తీరును నిరసిస్తూ యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు ధర్నా నిర్వహించారు. రోడ్డుపై ధాన్యం పోసి బైఠాయించారు. ధాన్యం సేకరణ విషయంలో స్పందించని రైస్‌మిల్లుపై చర్యలు తీసుకోవాలని, జూన్ 8లోగా కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లు క్వింటాల్ వడ్లకు 13 కిలోల కోత విధిస్తున్నారంటూ రైతులు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. తహసీల్దార్ అక్కడికి చేరుకొని కలెక్టర్‌తో రైతులతో ఫోన్లో మాట్లాడించారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

జొన్నలు కొనడంలో జాప్యాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. జొన్నలు తెచ్చి నెలరోజులైనా తరలించడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. కాగా తలమడుగు మండలం సుంకిడి అంతర్రాష్ట్ర రహదారిపై సీపీఐ ఆధ్వర్యంలో తాంసి, తలమడుగు మండలాల రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రానికి లారీ రావడం లేదని మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కిష్టంపేటలోని మంచిర్యాల-చెన్నూర్ ప్రధాన రహదారిపై రైతు ధర్నా చేశారు. నెల రోజులుగా ధాన్యం బస్తాలతో పడిగాపులు కాస్తున్నామని, పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడని రైతులు మండిపడ్డారు. ధాన్యం బస్తాలను తక్షణమే అన్లోడ్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద లారీ డ్రైవర్లు ధర్నా చేశారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా అరగంటపాటు లారీలను రోడ్డుకు అడ్డంగా పెట్టి ధర్నా చేపట్టారు.