Telangana | కీసర, జనవరి 18 : పదేండ్ల పాటు కేసీఆర్ సర్కారు కడుపున పెట్టుకొని కాపాడుకున్న రైతులను.. మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ మళ్లీ రోడ్డున పడేసింది. ఏదో మార్పు తెస్తుందని నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచింది. రుణమాఫీ, పెట్టుబడిసాయం, ధాన్యానికి బోనస్ ఇలా అన్నింటా ప్రభుత్వం కోతలు పెట్టడం, సాగునీళ్లివ్వక, కరెంటు సరఫరా చెయ్యక పాత రోజులను మళ్లీ తేవడంతో కడుపు మండిన అన్నదాతలు రోజుకోచోట తమ ఆవేదన, ఆగ్రహాన్ని నిరసనల రూపంలో వెలిబుచ్చుతున్నారు. రాష్ట్రమంతటా ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. శనివారం పలు ప్రాంతాల్లో వేర్వేరు కారణాలతో రైతులు నిరసన తెలిపారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా భోగారంలో రూ.కోటిన్నర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ట్రాన్స్ఫార్మర్కు అధికారులు తాళం వేయడంతో నీళ్లందక పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళనకు దిగారు. సబ్ స్టేషన్‌ను ప్రారంభించినా కరెంటు సరఫరా చేయడం లేదని వనపర్తి జిల్లా ఏదుట్ల సబ్‌స్టేషన్ వద్ద రైతులు నిరసన తెలిపారు. యాదాద్రి-భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో గొలుసుకట్టు చెరువులను నింపి సాగునీరు అందించాలని రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. సూర్యాపేట జిల్లాలోని లక్ష్మాపురం శివారులో ఎస్సారెస్పీ పిల్ల కాల్వలను పూర్తి చేసి సాగునీళ్లివ్వాలని రైతులు కెనాల్లోకి దిగి తమ ఆవేదన వెలిబుచ్చారు. మరోవైపు ‘మా భూములు మాకే కావాలి’ అంటూ రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నానక్‌నగర్ ఫార్మాసిటీ బాధితులు సదస్సు వేదికగా నినదించారు.
వ్యవసాయ పొలాలకు సాగునీటిని అందించే మోటర్లకు కరెంట్ అం దించే ట్రాన్స్ఫార్మర్లకు అధికారులు కనెక్షన్ తొలిగించారు. కనీస బిల్లు రూ. 30 కట్టలేదనే వంకతో కరెంట్ సరఫరా బంద్ చేశారు. దీం తో పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని భోగారంలో ముందస్తు సమాచారం లేకుండా అధికారులు ఈ చర్యకు పూనుకోవడంతో రైతులంతా ఆం దోళనకు గురవుతున్నారు. లైన్మెన్ భాస్కర్ తమ ట్రాన్స్ఫార్మర్లను బంద్ చేసి వైర్ కట్టినట్టు రైతులు చెబుతున్నారు. ఈ విషయమై ఏఈ మురళీకృష్ణను వివరణ కోరగా కీసర మండలం భోగారంలో రూ. కోటిన్నర వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. కట్టకపోవడంతోనే ట్రాన్స్ఫార్మర్లను బంద్ చేసినట్టు చెప్పారు. విషయం తెలుసుకున్న గ్రామ మాజీ సర్పంచ్ రాగి రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి సర్కార్ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో పదేళ్ల పాటు రైతులను గుండెల్లో పెట్టి చూసుకున్నారని గుర్తుచేశారు.
చివరి ఆయకట్టుకు ఇంకెప్పుడు నీళ్లిస్తరు? ; కాల్వలను ఇంకెప్పుడు పూర్తి చేస్తరు లక్ష్మాపురం శివారులో రైతుల నిరసన
చివరి ఆయకట్టుకు ఇంకెప్పుడు నీళ్లిస్తారంటూ సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని లక్ష్మాపురం రైతులు ప్రశ్నిస్తున్నారు. లక్ష్మాపురం శివారులో అసంపూర్తిగా ఉన్న ఎస్సారెస్పీ పిల్ల కాల్వలను పూర్తి చేసి, నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం రైతులు కాల్వలోకి దిగి నిరసన తెలిపారు. అసంపూర్తిగా ఉన్న కాల్వలతో ఆయకట్టు చివరి రైతులకు సాగు నీరందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం స్పందించి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
కరెంట్ కోసం కదం..
సబ్‌స్టేషన్‌ను ప్రారంభించినా విద్యుత్తు సరఫరా చేయకపోవడంతో రైతులు కదం తొక్కారు. లోవోల్టేజీతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కొత్త సబ్‌స్టేషన్ నుంచి వెంటనే కరెంటు సరఫరా చేయాలని వనపర్తి జిల్లా ఏదుట్ల సబ్‌స్టేషన్ వద్ద శనివారం నిరసన తెలిపారు.