దస్తురాబాద్ ; మిల్లర్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం పెర్కపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. దాదాపు మూడు గంటలకుపైగా రహదారిపై బైఠాయించడంతో వాహనాలను ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. క్వింటాల్‌కు 7 కిలోల వడ్లు అదనంగా తీసుకుంటున్నారని మండిపడ్డారు.
ధాన్యానికి నిప్పుపెట్టి అన్నదాతల ఆందోళన
క్వింటాళ్లకు పది కిలోల తరుగుపై మండిపాటు పంటను కొనుగోలులో జాప్యం చేయడమేకాకుండా తరుగు పేరుతో మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారని అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి పాలమూరు చౌరస్తా వరకు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ర్యాలీ నిర్వహించారు. మిల్లర్ల దోపిడీని నిరసిస్తూ ప్రధాన రోడ్డుపై ధాన్యం పారబోసి నిప్పుపెట్టారు. కల్వకుర్తి డివిజన్ పరిధిలో 8 పారాబాయిల్డ్ రైస్ మిల్లులు ఉండగా, కేవలం 2 మిల్లులకు మాత్రమే వరి కొనుగోలుకు అనుమతి ఇవ్వడం ఏమిటని మండిపడ్డారు. క్వింటాకు 10 కిలోల వరకు తరుగు తీయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో పొలాల వద్దకు వాహనాలు పంపించి అక్కడే కొనుగోలు చేసి రైతులకు మేలుచేశారని గుర్తుచేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులను శాంతింపజేశారు.
ధాన్యం కొనాలంటూ రోడ్డెకిన రైతులు
ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సొంత మండలంలో రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మంథని నియోజకవర్గమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెం గ్రామానికి చెందిన రైతులు కాటారం-మంథని ప్రధాన రహదారిపై ధాన్యం పోసి ధర్నా చేశారు. ‘వద్దురా నాయనా.. కాంగ్రెస్ పాలన’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోడం దారుణమని అన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు రోడ్డెకాల్సిన దుస్థితి దాపురించిందని వాపోయారు. – మహదేవపూర్ (కాటారం)
బుద్ధారంలో రైతుల నిరసన
తూకం వేసిన ధాన్యం తరలించేందుకు లారీలు రాకపోవడంతో వారాల తరబడి ప్రక్రియ నిలిచిపోతుందంటూ వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారంలో మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు. ఎర్రటి ఎండలో రోడ్డుపై ధాన్యం పోసి.. వరి కంకులతో బైఠాయించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తూకం వేసిన ధాన్యం బస్తాలు లారీలురాక వారాల తరబడి నిలిచిపోతున్నాయని వాపోయారు. – గోపాల్పేట
ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల బైఠాయింపు
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్‌లో ధాన్యం తూకం వేయాలని డిమాండ్‌చేస్తూ వెల్దుర్తి-మెదక్ ప్రధాన రహదారిపై మంగళవారం రైతులు బైఠాయించారు. ఈనెల 17న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా ఇప్పటివరకు గింజ కూడా కొనలేదని మండిపడ్డారు. సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌చేశారు.
– వెల్దుర్తి