రాజాపేట, జనవరి 17 : కాళేశ్వరం జలాలతో యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని చెరువులను నింపాలని రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం రాజాపేటలో ధర్నా చేశారు. అనంతరం స్థానిక గోపాల్చెరువును పరిశీలించి మాట్లాడారు. చెరువుల్లో చుక్క నీరు లేక సాగు భూములు బీళ్లుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కాళేశ్వరం 15వ ప్యాకేజీ కాల్వ పనులు త్వరగా పూర్తిచేసి మండలంలోని గొలుసు కట్టు చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. చెరువులు నింపే వరకు మండల కేంద్రం లో రిలే దీక్షలు చేపడుతామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో రైతు జేఏసీ మండల కన్వీనర్ ఎర్రగోకుల జశ్వంత్, గౌరవ అధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, ఊట్కూరి అశోక్‌గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేశ్, బీజేపీ నాయకుడు మేకల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.