యాచారం, జూలై 5 : కాంగ్రెస్ సర్కార్‌పై రైతులు భగ్గుమన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తి గ్రామపంచాయతీ ఆవరణలో తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీపీజేఏసీ) ఆధ్వర్యంలో ఆదివారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని కోకన్వీనర్ కన్నెగంటి రవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఫార్మా బాధిత గ్రామాలైన మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కురుమిద్దకు చెందిన బాధిత రైతులు, కూలీలు, ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యారు. గ్రామంలో నాయకులు, రైతులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.
మానవహక్కుల వేదిక నాయకులు జీవన్‌కుమార్, తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది రఘు, సీనియర్ జర్నలిస్టు వసంతకుమారి, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొ. విజయ్, రిటైర్డ్ తహసీల్దార్ బాలరాజు పాల్గొని ఫార్మా బాధిత రైతుల అభిప్రాయాలను సేకరించారు. ఫ్యూచర్‌సిటీ భూసేకరణలో జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలపై రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ‘మాకు మా భూములే కావాలి. ఫ్యూచర్‌సిటీ వద్దు’ అని రైతులు మూకుమ్మడిగా గొంతెత్తి నినదించారు. ఫార్మాసిటీకి ఇవ్వని భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి వెంటనే 2,250 ఎకరాలను ఆన్లైన్లో రైతుల పేరిట నమోదు చేయాలని స్పష్టంచేశారు.
రైతులతో కలిసి ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, కోదండరాం, కోదండరెడ్డి పదవులు రాగానే తమను విస్మరించినట్టు ధ్వజమెత్తారు. ఫార్మాసిటీ రద్దు చేస్తారని, రైతుల బాధలు తీరుతాయని మల్రెడ్డి రంగారెడ్డికి ఓటేసి గెలిపిస్తే ఎక్కడికి పోయిండని ప్రశ్నించారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు తమ భూములను తీసుకోవద్దని గిరిజన రైతులు రెండు నెలలు రిలే దీక్షలు చేస్తే కన్నెత్తి చూడని కాంగ్రెస్ నాయకులకు త్వరలోనే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వం కండ్లు తెలిపించేందుకే ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్టు కన్నెగంటి రవి తెలిపారు.