పెంట్లవెల్లి, మే13 : తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలులో పెబ్బేరు- కొల్లాపూర్ రోడ్డుపై మంగళవారం రైతులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐకేపీ అధికారులు రైస్మిల్లర్లుతో చేతులు కలిపి రెండు నెలల నుంచి తేమ పేరుతో ధాన్యాన్ని కాంటా వేయడంలేదని ఆరోపించారు. ఆది, సోమవారాల్లో కురిసిన భారీ వర్షానికి ధాన్యం మొత్తం తడిసి ముద్దయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సై రామన్‌గౌడ్, ఏపీఎం గౌస్ చేరుకొని ఉన్నతాధికారులతో మా ట్లాడి తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని చెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు.
వీపనగండ్ల, మే 13 : ధాన్యం కొనుగోలులో అధికారులు, ఐకేపీ సిబ్బంది నిర్లక్ష్యంపై వనపర్తి జిల్లా వీపనగండ్ల బస్టాండ్ ఆవరణలో రైతులు రాస్తారోకో చేపట్టారు. తాలు పేరుతో 40 కేజీల బస్తాకు 3 కేజీలపైన తరుగు తీస్తున్నారని ఆవేదన చెందారు. అదేమార్గంలో వెళ్తున్న తహసీల్దార్ వరలక్ష్మి వాహనాన్ని అడ్డుకొని నిలదీశారు. స్పందించిన ఆమె సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
సిరిసిల్ల రూరల్, మే 13: కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కాంటా పెడ్తలేరని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో సిరిసిల్ల-సిద్దిపేట రహదారిపై రైతులు, బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి, ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు జిల్లెల్లకు చేరుకుని రైతులతో మాట్లాడి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
పెబ్బేరు, మే 13 : కాంగ్రెస్ ప్రభుత్వంలో ధాన్యం అమ్ముకునేందుకు రైతులు అరిగోస పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా పెబ్బేరులోని సుభాష్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా గన్నీ బ్యాగులు.. లారీలు లేవంటూ ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపించారు. తూకం వేసే క్రమంలో తరుగు తీస్తున్నారని ఆవేదనచెందారు.
ఖానాపూర్, మే 13 : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్వచింతల్‌లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అధిక తూకం వేస్తున్నారని రైతులు నిర్వాహకులను గదిలో నిర్బంధించారు. నిబంధనలకు విరుద్ధంగా తూకం వేస్తున్నారని మంగళవారం సీఈవో భూమి ఆశన్న, కొనుగోలు కేంద్ర నిర్వాహకుడు రాజేశ్వర్‌రెడ్డిని గదిలో బంధించారు. పోలీసులు, డీసీవో పాపయ్య చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.