ఆదిలాబాద్, నవంబర్ 8(నమస్తే తెలంగాణ): పత్తి కొనుగోళ్ల తీరుపై రైతులు ఆందోళనకు దిగారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోళ్ల విషయంలో అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా శనివారం ఆదిలాబాద్ జిల్లా నేరడగొండలో హైదరాబాద్-నాగ్పూర్ జాతీయ రహదారి-44పై బైఠాయించారు. సీసీఐ పత్తి కొనుగోళ్లను కపాస్ కిసాన్ యాప్ ద్వారా కాకుండా పాత పద్ధతిలో చేపట్టాలని, తేమ శాతాన్ని 20 వరకు పెంచాలని, ఎకరాకు 12 క్వింటాళ్లు సేకరించాలని డిమాండ్ చేశారు.
మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్న సోయా పంటలో తేమ శాతం18 వరకు పెంచాలని, ఎకరాకు 10 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని సూచించారు. రైతుల రాస్తారోకోతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచాయి. అధికారులు రైతులతో ఫోన్లో మాట్లాడి సానుకూలంగా స్పందించడంతో ఆందోళన విరమించారు.