ఆత్మకూర్.ఎస్, ఏప్రిల్ 16: ఈదురు గాలులు, వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ఆత్మకూర్.ఎస్ మండలంలోని పాతర్లపహాడ్ స్టేజీ వద్ద సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై బుధవారం బైఠాయించారు. ఇస్తాళాపు రం, పాతర్లపహాడ్, ముక్కుడుదేవులపల్లి, కొత్తతండా, బోరింగ్ తండా గ్రామాల పరిధిలో 2 వేల ఎకరాలకుపైగా వరి పంట నేల పాలైనా.. అధికారులు స్పం దించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు వేయకపోవడంతో వర్షానికి తడిసిపోయిందని వాపోయారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశా రు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని మండల వ్యవసాయ అధికారి దివ్య, ఆర్ఐ స్వప్న హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.