కామారెడ్డి, జూన్ 15: విద్యుత్తు లేక వరినార్లు ఎండిపోతున్నాయని, వెంటనే కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. డీడీలు కట్టి మూడు నెలలవుతున్నా ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం లేదని అధికారులపై మండిపడ్డారు. ఈ మేరకు శనివారం కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి విద్యుత్తు సబ్స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. దీంతో కామారెడ్డి-మెదక్ ప్రధాన రహదారిపై రెండు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
కామారెడ్డి మండలం తిమ్మక్పల్లికి చెందిన రైతులు వ్యవసాయ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్ల కోసం డీడీలు కట్టారు. మూడు నెలలవుతున్నా అధికారులు ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దెలు కట్టారు తప్పితే ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. వర్షాలు పడితే పొలాల్లో స్తంభాలు వేయరాదని, గ్రామంలోనూ కరెంట్ సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. కరెంట్ లేక వరి నార్లు ఎండిపోయే పరిస్థితి ఉందని చెప్పారు.
ఏ అధికారి వద్దకు వెళ్లినా సరైన సమాధానం చెప్పడం లేదని రైతులు మండిపడ్డారు. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలా మంది రైతులు ఇంకా నార్లు పోయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల ధర్నాతో మెదక్-కామారెడ్డి ప్రధాన రహదారిపై సుమారు రెండు గంటలకుపైగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడకు చేరుకుని సముదాయించడంతో రైతులు ధర్నా విరమించారు.