పాలకుర్తి, జూన్ 11: కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి నెలలు గడిచినా కొంటలేరని రైతులు భగ్గుమన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూరులో గురువారం వడ్లకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నెలల తరబడి కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం నిల్వ ఉంటున్నదని, కాంటా వేయడం లేదని మండిపడ్డారు. వానకాలం వచ్చినా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదా? అని ప్రశ్నించారు.
కలెక్టర్ ఆదేశాలను అధికారులు బేఖాతర్ చేస్తున్నారని, ప్రజా ప్రభుత్వంలో వడ్లు కొనుగోలు చేయకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరించారు. అధికారులకు విన్నవించినా, కలెక్టర్కు చెప్పినా ఫలితం లేదని వాపోయారు. తరుగు పేరిట బస్తాకు రెండు కిలోల ధాన్యం కట్ చేస్తేనే నిర్వాహకులు కాంటా పెట్టి, మిల్లులకు తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా విస్నూరుకు చెందిన రైతు అరూరి పర్శరాములు బోరున విలవిస్తూ కేంద్రంలోనే వడ్లకు నిప్పు పెట్టాడు.