రాజోళి, నవంబర్ 9 : ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేసే వరకు రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఈ విషయమై అసెంబ్లీలో పోరాటం చేస్తానని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట కమిటీ చేపట్టిన నిరసనకు శనివారం ఎమ్మెల్యే పాల్గొని మద్దతు తెలిపి మాట్లాడారు. విషపూరితమైన కంపెనీలకు అనుమతులిచ్చి పచ్చని పొలాలను ఎడారిగా మారుస్తున్నదని సర్కారుపై మండిపడ్డారు. అనుమతులను రద్దు చేయకపోతే రైతుల ఉసురు తప్పదని హెచ్చరించారు. ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపినట్టు చెప్పారు. కార్యక్రమంలో రైతులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
పరిశ్రమను తరలిస్తే సర్వేకు సహకరిస్తాం
దిలావర్పూర్: నిర్మల్ జిల్లా దిలావర్పూర్-గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను తరలిస్తేనే తాము ప్రభుత్వం చేపట్టే సమగ్ర కుల గణన సర్వేకు సహకరిస్తామని జిల్లా అధికారులకు గ్రామస్థులు తేల్చి చెప్పారు. శనివారం దిలావర్పూర్-గుండంపల్లి గ్రామాల్లో జిల్లా అధికారులు సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో సర్వేకు సహకరించాలని గ్రామస్థులను కోరగా.. ఇథనాల్ పరిశ్రమను తరలిస్తేనే సహకరిస్తామని తేల్చి చెప్పారు.