ఎల్లారెడ్డి రూరల్/భూదాన్‌పోచంపల్లి/మునగాల/గంభీరావుపేట, ఫిబ్రవరి 18: ‘పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ మంచిగుండె.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక తెచ్చిన యాప్‌తో తిప్పలు పడుతున్నాం’ అని రైతులు ఆవేదన చెందుతున్నారు. యూరియా యాప్ ను వ్యతిరేకిస్తూ బుధవారం పలు జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగారు. యాప్‌లో బుక్ చేద్దామంటే ఓటీపీ రావడం లేదని, అది వచ్చే సరికి ఉన్న స్టాక్ అయిపోయితుందని మండిపడుతున్నారు. యాప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని గండిమాసానిపేట్ సొసైటీ ఎదుట గల కామారెడ్డి-ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించారు. యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవాలంటే ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాల్సి వస్తున్నదని, యాప్‌లో బుక్ చేద్దామంటే ఓటీపీ రావడం లేదని, అది వచ్చే సరికి ఉన్న స్టాక్ అయిపోయితున్నట్టు చూపిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. దాదాపు 40 నిమిషాలపాటు ధ ర్నా చేయడంతో ఇరువైపులా భారీగా వాహనా లు నిలిచిపోయాయి. పోలీసులు సర్దిచెప్పడం తో రైతులు శాంతించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద బుధవారం యూరియా కోసం రైతులు బారులుతీరారు. యూరియా ఇ స్తున్నారని సమాచారం తెలుసుకొని చాలామంది రైతులు అకడికి చేరుకున్నారు. యాప్ లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఇస్తామనడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం 444 బస్తాలు రాగా యాప్‌లో బుక్ చేసుకున్న రైతులకు పంపిణీ చేశారు.
యాప్ పనిచేయక యూరియా బుక్ కాకపోవడంతో సూర్యాపేట జిల్లా మునగాల సొసైటీ వద్ద రైతులు గోదాంకు తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్‌లో యూరియా బుకింగ్ తెలియని రైతులు తమ పిల్లలను స్కూల్ బంద్ చేయిస్తున్నారని పేర్కొన్నారు. యాప్‌ను రద్దు చేసి సొసైటీ వద్దే పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని మన గ్రోమోర్ ఎరువుల కేంద్రం వద్ద బుధవారం రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. స్మార్ట్ ఫోన్, యాప్, ఓటీపీ, బుకింగ్, నో స్టాక్, సర్వర్ డౌన్, అంటూ రైతులకు తీవ్ర గోస పెడ్తున్నారని మండిపడ్డారు. గతంలో మాదిరిగా యూరియా బస్తాలను నేరుగా విక్రయించాలని డిమాండ్ చేశారు.