షాబాద్, నవంబర్ 26 : ఏండ్ల తరబడిగా సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఇచ్చేదిలేదని రైతులు తేల్చి చెప్పారు. రంగారెడ్డిజిల్లా షాబాద్ మండలం మక్తగూడ, రేగడిదోస్వాడ, వెంకమ్మగూడ గ్రా మాల్లో బుధవారం రెవెన్యూ అధికారులు ప్రభుత్వం ఫార్మా భూములను తీసుకుంటుందని చెప్పడంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే ఆయా గ్రామాల రైతులు షాబాద్ తహసీల్ కార్యాలయానికి చేరుకుని ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తహసీల్దార్ అన్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…రేగడిదోస్వాడలో సర్వేనంబర్ 102లోని 400 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని 70 ఏండ్లుగా 600 మంది రైతు లు సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నట్టు తెలిపారు. జీవనాధారమైన భూములను గుంజుకుంటే ఎలా బతకాలని ప్రభుత్వా న్ని ప్రశ్నించారు. భూముల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
కడ్తాల్, నవంబర్ 26: గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.కోటి నష్ట పరిహారం అందించాలని, లేకుంటే భూమికి భూ మిని పరిహారంగా అందించాలని భూనిర్వాసితులు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో చేపట్టనున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూమలు కో ల్పోతున్న మర్రిపల్లికి చెందిన భూ నిర్వాసితులతో బుధవారం గ్రామసభ నిర్వహించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డి, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు, కందుకూర్ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, కడ్తాల్ తహసీల్దార్ జయశ్రీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.30 లక్షలు నష్టపరిహారం, ఎకరాకు రూ.25 లక్షలతోపాటు ఒక ప్లాట్ అందిస్తుందని పేర్కొన్నారు. భూ నిర్వాసితులు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా సాగు చేస్తున్న పచ్చని పొలాలగుండా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణం చేపట్టడం దారుణమని మండిపడ్డారు.