హత్నూర, అక్టోబర్05 : చేతికొస్తున్న వరి పంటలు ఎండిపోతుంటే నిరంతరం కరెంటు కోతలు విధిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వానికి రైతుల కష్టాలు పట్టవా అంటూ సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నస్తీపూర్ సబ్ స్టేషన్ ఎదుట మంగాపూర్ గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పంట సాగు నుండి పంట చేతికొచ్చే దశ వరకు రైతులను అన్ని రకాలుగా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొన్నటి వరకు యూరియా కోసం నానా ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వం చేతికొచ్చిన పంటలను దక్కించుకుందామంటే కరెంటు కోతలు విధిస్తూ పంటలు ఎండిపోయే దుస్థితికి తీసుకువస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏనాడూ ఇంతటి కష్టం రైతులకు రాలేదని ఇప్పుడే ఎందుకు ఇంత అద్వాన పరిస్థితులు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు 24 గంటల కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం కేవలం 6 గంటలు కూడా వ్యవసాయానికి సక్రమంగా ఇవ్వలేకపోతుందని ఆరోపించారు.
రాత్రి సమయంలో కరెంటు కోతలు విధిస్తూ పగలు కరెంటు ఇస్తున్నాం అంటున్న విద్యుత్ అధికారులు పగలు సైతం సక్రమంగా ఇవ్వకపోగా ఇచ్చే కరెంటు సైతం లో వోల్టేజీ ఇస్తూ కోతలు విధిస్తుందన్నారు. దీంతో చేతికి వస్తున్న పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వాలని లేని పక్షంలో ఎక్కడికక్కడ ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.