మల్లాపూర్, జూన్ 24 : ‘ఓ వైపు వానలు కురవడం లేదు.. మరో వైపు ట్రాన్స్ఫార్మర్లు పాడై నీరందక పంటలు ఎండిపోతున్నయ్.. మహాప్రభో’ అంటూ మంగళవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్కు చెందిన 30 మంది రైతులు మల్లాపూర్ విద్యుత్తు సబ్స్టేషన్ ఎదుట అందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ శివారులోని 40 మందికి సంబంధించిన రెండు విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు పాడై పది రోజులు గడిచిందని, ఎన్నిసార్లు అధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకోవడంలేదని వాపోయారు. మక్క, పసుపు పంటలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయని, వరి నార్లు పోయకుండా కరెంట్ కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
పాన్గల్, జూన్ 24 : ప్రభుత్వం రైతు భరోసా డబ్బులను అరకొరగా ఖాతాల్లో వేసిందని రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం వనపర్తి జిల్లా పాన్గల్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద సీపీఎం మండల కార్యదర్శి బాల్యానాయక్ ఆధ్వర్యంలో రైతులు పట్టాపాస్ పుస్తకాలతో నిరసన తెలిపారు.
తొమ్మిది ఎకరాల వరకు రైతుభరోసా డబ్బులు చెల్లించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రతి రైతుకు పంట పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు.