కథలాపూర్, జనవరి 28 : రుణమాఫీ కాలేదని, రైతు భరోసా అందలేదని జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలో రైతులు నిరాహార దీక్షకు దిగారు. ముందుగా ప్రభుత్వ పాఠశాల నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహాత్మాగాంధీ, తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద నిరాహారదీక్ష చేపట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ.2 లక్షల పంట రుణం మాఫీ చేయాలని, రైతు భరోసా నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ దీక్షకు అన్ని పార్టీల నాయకులు మద్దతు తెలిపి కూర్చోవడం విశేషం. దీక్షా శిబిరం వద్దకు తహసీల్దార్ వినోద్, ఏవో యోగితా, ఎస్సై నవీన్‌కుమార్ చేరుకుని.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, దీక్షను విరమించాలని కోరారు. ఇప్పటికే రైతు భరోసా నిధులు మూడు సార్లు రావాల్సి ఉండగా.. ఇంకెప్పుడు ఇస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. ఈ దీక్షలో రైతు నాయకులు లోక శశిధర్‌రెడ్డి, గడ్డం రాజేశ్వర్‌రెడ్డి, బద్దం మహేందర్‌రెడ్డి, గడ్డం రాజారెడ్డి, కొండ ఆంజనేయులు తదితరులు కూర్చున్నారు. అధికారుల విజ్ఞప్తి మేరకు రైతులు దీక్ష విరమించారు.