చండూరు, డిసెంబర్ 19 : దళారులు దర్జాగా పత్తిని అమ్ముకుంటుంటే.. అసలైన పత్తి రైతులు అదే పత్తి అమ్మకానికి నరకయాతన పడుతున్నారు. రైతులు తెచ్చిన పత్తిలో నాణ్యతలేదని కొనుగోలుదారులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తుండగా, దళారులు తెచ్చిన పత్తిని దర్జాగా కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు పత్తి మిల్లుల వద్ద రైతులకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురవుతున్నది. నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పరిధిలో ఉన్న ఓ స్పిన్నింగ్ మిల్లులో ఇదే విషయమై రైతుల పత్తిని దిగుమతి చేసుకోకపోవడంతో రైతులు గంటలపాటు మిల్లు ఎదుట ఆందోళన చేపట్టిన ఘటన శుక్రవారం చోటుచేసుకున్నది. ఒకవైపు పత్తిని అమ్ముదామంటే కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ కాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ స్లాట్ బుక్ అయి నేరుగా రైతులు మిల్లుకు పత్తి తీసుకెళ్తే పత్తి నాణ్యత లేదని తిరస్కరిస్తున్నారు. ఇదే రైతులు తాము తెచ్చిన పత్తిని బయట దళారులకు అమ్ముకొని నష్టాలు మూటకట్టుకుంటున్నారు. అదే దళారులు అదే పత్తిని అదే మిల్లుకు తీసుకొస్తే వెంటనే ఎలాంటి అభ్యంతరాలు పెట్టకుండా, నాణ్యతా ప్రమాణాలు చూడకుండా కొనుగోలు చేస్తున్నారని బాధిత రైతులు గగ్గోలు పెడుతున్నారు. కష్టపడి పత్తి పంట పండించిన రైతులు నష్టపోతుంటే.. వారి వద్ద కొన్న దళారులు మాత్రం లక్షలు పోగేసుకుంటున్నారు.
బంగారిగడ్డలోని స్పినింగ్ మిల్లులో గురువారం స్లాట్ బుక్ అయిందని పలువురు రైతులు పత్తిని అమ్మకానికి తీసుకొచ్చారు. కానీ, కొనుగోలుదారులు గురువారం కొందరు రైతుల పత్తిని దిగుమతి చేసుకొని మిగతా రైతుల పత్తి కొనుగోలుకు నిరాకరించారు. మునుగోడులోని మరో పత్తి మిల్లు నుంచి వచ్చిన సుమారు 70 ట్రాక్టర్ల పత్తిని దిగుమతి చేసుకుంటుండగా బంగారిగడ్డ మిల్లు వద్ద ఉన్న రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. గురువారం స్లాట్ బుక్‌చేసిన పత్తిని దిగుమతి చేసుకోకుంటే స్లాట్ రద్దవుతుందని రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం వచ్చిన ట్రాక్టర్లలోని పత్తిని దిగుమతి చేస్తుండగా, రెండు రోజులుగా తాము ఇక్కడ పడిగాపులు కాస్తున్నా పట్టించుకోకుండా, ఆలస్యంగా వచ్చిన పత్తిని ఎలా దిగుమతి చేస్తున్నారని రైతులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. సుమారు గంటపాటు 250 మంది రైతులు మిల్లు వద్ద ఆందోళనకు దిగారు. స్థానిక ఎస్సై వెంకన్నగౌడ్ అక్కడికి చేరుకొని విచారించారు. గురువారం తెచ్చిన పత్తి అమ్మకానికి మళ్లీ స్లాట్ బుక్ చేసి, పత్తి దిగుమతి చేసేలా చొరవ తీసుకుంటామన్న హామీతో ఆందోళన విరమించారు.
బంగారిగడ్డ మిల్లు వద్ద రైతులను కొనుగోలుదారులు తిప్పలు పెడుతున్నరు. గురువారం స్లాట్ బుక్ కావడంతో నేను ఇక్కడకు రెండు ట్రాక్టర్ల పత్తి తీసుకొచ్చిన. కానీ, ఒక ట్రాక్టర్ మాత్రమే పత్తిని దిగుమతి చేసి రెండో ట్రాక్టర్‌లోని పత్తిని దిగుమతి చేయకుండా ఇక్కడే ఉంచారు. శుక్రవారం వచ్చిన పత్తిని దిగుమతి చేసుకుంటున్నరు. ఇక్కడ మధ్య వ్యక్తులు ఎట్లా చెప్తే మిల్లుల అట్ల వింటున్నారు. నిజమైన రైతులకు మాత్రం న్యాయం జరగడం లేదు.
ప్రభుత్వం కపాస్ కిసాన్ యాప్ తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. స్లాట్ బుక్ కాక ఇబ్బందులు పడి విసిగిపోయి కొంత పత్తిని దళారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. మా వద్ద కొన్న పత్తిని ఇదే మిల్లులో స్లాట్ బుక్ చేసుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. రైతుల పత్తిని దిగుమతి చేసుకోకుండా రోజుల తరబడి నిరీక్షిచండం వల్ల ట్రాక్టర్ కిరాయిలు ఎక్కువగా అవుతున్నాయి. పెట్టిన పెట్టుబడులు కూడా రావడంలేదు.