ఆదిలాబాద్, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ): రూ.రెండు లక్షల రూణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రెండోరోజైన ఆదివారం కూడా రైతుల ఆందోళనలు కొనసాగాయి. జిల్లాలోని బజార్హత్నూర్ మండలం కేంద్రంతోపాటు తలమడుగు మండలం రుయ్యాడి, బేల మండలం సిర్సన్న, భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామాల్లో రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బజార్హత్నూర్, రుయ్యాడిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిష్టిబొమ్మతో డప్పుచప్పుళ్ల నడుమ పటాకులు కాలుస్తూ శవయాత్ర నిర్వహించారు.
అనంతరం సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. సిర్సన్న, పిప్పల్కోటి గ్రమాల్లో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని రైతులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.