తొర్రూరు/నర్సింహులపేట, మే 24 : తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ముంగిమడుగులో రైతులు ధర్నాకు దిగారు. అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యంతో నర్సింహులపేట మండలం నర్సింహులపేట, ముంగిమడుగు, వంతడుపుల, పెద్దనాగారంలో కొనుగోళ్ల ప్రక్రియ మందకొడిగా సాగుతున్నదని వారు తెలిపారు.
వర్షాలకు మొలకెత్తిన వడ్లను చూపిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. తాము 45 రోజుల క్రితం కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చినా.. ఇప్పటివరకు కాంటా పెట్టలేదని తొర్రూరు మండలం ఫతేపురం గ్రామానికి చెందిన నిమ్మల రామ్మూర్తి, కొండ అశోక్ ఆవేదన వ్యక్తంచేశారు. తడిసిన ధాన్యాన్ని ఎండబెడితేనే కొనుగోలు చేస్తామని అధికారులు చెప్తున్నారని వారు మండిపడ్డారు. తక్షణమే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశౠరు.
నేను నెల కింద ముంగిమడుగు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో సన్నవడ్లు పోసిన. నాతోపాటు చాలామంది రైతులు సెంటర్లో పోసిన్రు. నిర్వాహకులు తూకం వేసి బస్తాలు నిల్వ ఉంచిండ్రు. అకాల వర్షాలతో ఇప్పటికే మూడుసార్లు వడ్ల బస్తాలు తడిశాయి. దీంతో 119బస్తాల్లో కింది భాగంలో ఉన్న వడ్లు బస్తాల నుంచి మొలకెత్తుతున్నాయి. కలెక్టర్ సారు.. ఇప్పటికైనా స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేసి మొలకెత్తుతున్న ధాన్యం బస్తాలను వెంటనే మిల్లులకు తరలించేలా చూడాలి.
– మంద నరేందర్రెడ్డి, రైతు, రామన్నగూడెం, నర్సింహులపేట మండలం,