కల్హేర్/ఇల్లంతకుంట, సెప్టెంబర్ 11 : ఎండిపోతున్న పొలాలకు నీరివ్వాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కల్హేర్ తహసీల్ కార్యాలయం ఎదుట ఇందిరానగర్ రైతులు శుక్రవారం ధర్నాకు దిగారు. 200ఎకరాల పంట ఎండిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో నీరుందని అధికారులు చెప్పారని, ఇప్పుడు పంటలు వేసుకున్న తర్వాత నీరిచ్చేందుకు వెనుకాడుతున్నారని మండిపడ్డారు. వెంటనే స్పందించిన తహసీల్దార్ శివశ్రీనివాస్ ఇరిగేషన్ ఈఈతో ఫోన్లో మాట్లాడారు. రైతుల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నీరందిస్తామని ఆయన హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. రెండు రోజుల్లో నీరందించకుంటే సబ్‌కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగుతామని హెచ్చరించారు.
మిడ్‌మానేర్ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి శివారులోని బ్రిడ్జిపై రైతులు ధర్నాకు దిగారు. మధ్య మానేరులో నీరున్నా.. కుడి కాలువ ద్వారా విడుదల చేయకపోవడంపై మండిపడ్డారు. నీటి విడుదల చేయాలని స్థానిక ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణను కోరినప్పటికీ ఇప్పటి వరకు స్పందించడం లేదని మండిపడ్డారు. మిడ్‌మానేర్ డీఈ సూర్యప్రకాశ్, ఏఈ వంశీ రైతుల వద్దకు చేరుకొని తాగునీరు అందించాల్సి ఉన్నందున పంటలకు నీటిని విడుదల చేయడం కుదరదని తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అనంతరం పోలీసుల జోక్యంతో రైతులు ధర్నా విరమించారు.