నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 28: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతన్నలు అరిగోస పడుతున్నారు. వానకాలం పొడవునా యూరియా కోసం సొసైటీ కేంద్రాల వద్ద రేయింబవళ్లు పడిగాపులు కాసిన రైతులు ప్రస్తుత యాసంగిలోనూ అవే అష్టకష్టాలు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం, తీర్ధాల సొసైటీ సెంటర్ల వద్దకు భారీగా చేరుకున్న రైతులు యాప్ పనిచేయడం లేదంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. యాప్ పనిచేయకపోవడంతో బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. చింతకాని మండలం నాగులవంచలో ఓ ప్రైవేట్ డీలర్ ఆదివారం రాత్రే అక్రమంగా యూరియా విక్రయాలు జరిపాడు. యూరియా కోసం తల్లాడ సొసైటీ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.
తిరుమలాయపాలెం మండలం తిరుమలాయపాలెం, పిండిప్రోలు, జల్లేపల్లి, బచ్చోడు గ్రామాల్లో యాప్ పనిచేయకపోవడంతో అధికారులు పాతపద్ధతిలోనే యూరియా పంపిణీ చేశారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలోని ఆగ్రోస్, రైతు వేదిక వద్ద అన్నదాతలు బారులు తీరారు. అక్కడికి వచ్చిన తహసీల్దార్ శ్రీనివాసులును నిలదీశారు.
నర్సింహులపేట మండలం పెద్ద నాగారం రైతు వేదిక వద్ద, మండల కేంద్రంలోని సొసైటీ వద్ద, మరిపెడ, చిన్నగూడూరులో పోలీసు పహారా మధ్య పంపిణీ చేశారు. గద్వాల జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్‌కు దాదాపు 150 రైతులు తెల్లవారుజామునే అక్కడికి చేరుకున్నారు. చాలామందికి అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. కరీంనగర్ జిల్లా గంగాధరలోని సొసైటీకి 230 బస్తాలు వచ్చాయనే సమాచారంతో 100 మందికిపైనే రైతులు బారులుతీరారు. గంగాధర మండలం కురిక్యాల సొసైటీ వద్ద 450 యూరియా బస్తాలు వచ్చాయని తెలుసుకున్న రైతులు బారులు తీరారు.

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట పీఏసీఎస్ వద్ద యూరియా బస్తాల కోసం లైన్లో నిల్చున్న రైతులు

యాసంగి సన్న వడ్డకు బోనస్ చెల్లించాలని సోమవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో రైతులు ఆందోళనకు దిగారు.
– ఖానాపూర్ టౌన్

కాంగ్రెస్ హామీలు అమలుచేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో రైతులు ధర్నా చేశారు.
– లింగంపేట(తాడ్వాయి)