బోనకల్లు/ఆలూర్, ఏప్రిల్ 20 : మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట్లలో బోనకల్లు – ఖమ్మం రహదారిపై రైతులు, బీఆర్ఎస్, సీపీఎం, రైతు నాయకులు బైఠాయించారు.
‘ప్రజావాణి’ని అడ్డుకున్న రైతులు మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ముష్టికుంట్ల, రావినూతల గ్రామాల రైతులు సోమవారం ఖమ్మం జిల్లా బోనకల్లు తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. తహసీల్దార్ చాంబర్ ఎదుట బైఠాయించారు. దీంతో విషయాన్ని తహసీల్దార్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు ముష్టికుంట్ల, రావినూతలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
నిజామాబాద్ జిల్లా ఆలూర్లోని సొసైటీ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. సొసైటీ పరిధిలోని ఇస్సాపల్లికి చెందిన అన్నదాతలు సీఈవో చాంబర్ ఎదుట బైఠాయించారు. కేంద్రాల్లోనే మగ్గుతున్న మక్కలు చిట్యాల/నర్సంపేట, ఏప్రిల్ 20 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల వ్యవసాయ మార్కెట్ ఆవరణలోకి రైతులు మక్కలు తెచ్చారు. తేమ ఉండటంతో అక్కడే ఆరబోసుకున్నారు. కాగా కేంద్రంలో గన్నీ సంచులు అందించడంలేదని, ఒకవేళ ఇచ్చినా ట్రక్షీట్ త్వరగా అందించడం లేదని వాపోతున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్ పదిరోజుల తర్వాత సోమవారం పునఃప్రారంభం కావడంతో మక్కలు భారీగా తరలివచ్చాయి. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ వ్యాపారులు సిండికేట్గా మారి దోచుకుంటున్నారు. మార్కెట్లో మక్కలను ఆరబెట్టేందుకు స్థలం సరిపోక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మక్కలతో వచ్చిన వాహనాలు మార్కెట్ ఎదుట బారులు తీరాయి.