బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 19: ఆరబెట్టిన ధాన్యానికి కాంటా పెట్టకపోవడాన్ని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ సొసైటీ వద్ద ఆదివారం రైతులు ఆందోళన చేపట్టారు. సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. రోజుల తరబడి ధాన్యాన్ని ఆరబెట్టినా కాంటా పెట్టడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తూ, పక్క గ్రామాలకు వెళ్లి కాంటా పెడ్తున్నారని సొసైటీ అధికారులపై మండిపడ్డారు.
సొసైటీ కార్యదర్శికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయని, ఆరబెట్టిన ధాన్యం తడిసిపోతుందని వాపోయారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని కాంటా వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.