తల్లాడ, ఫిబ్రవరి 16: ఎండిపోతున్న ఆయకట్టు పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం, గోపాలపేట, తల్లాడ, నరసింహారావుపేట, అంజనాపురం, గాంధీనగర్ తండా, వెంకటగిరి రైతులు ధర్నా చేపట్టారు. సోమవారం తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఎన్ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. నీటి విడుదలపై అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆగ్రహించిన రైతులు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, ఆఫీసు గదికి తాళం వేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా రైతు సంఘ జిల్లా నాయకుడు శీలం సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. సాగర్ కాలువల ఆయకట్టు కింద వేసిన వరి పంటలకు నీరు అందకపోవడంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే సిరిపురం, తెలగారం మేజర్లకు నీటిని విడుదల చేయాలని కోరారు. కల్లూరు ఎన్ఎస్పీ ఈఈని ఫోన్లో సంప్రదించగా.. నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.