జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ‘వాన కాలం బోనస్ డబ్బులు ఇస్తరా.. ఇయ్యరా?.. ఇంకా ఎన్ని రోజులు మీ చుట్టూ తిరగాలి? రైతులంటే పిచ్చోళ్లలా కనిపిస్తున్నరా? మా డబ్బుల కోసం ప్రశ్నిస్తే రాజకీయం అంటరా? గొప్పల కోసం బోనస్ అంటూ హామీలు ఇచ్చి ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నరు? మీరు ఇలాగే వ్యవహరిస్తే మా భార్యాపిల్లలతోపాటు మందు డబ్బాలతో వచ్చి కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్య చేసుకుంటం’ అని రైతులు హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసన తెలిపారు. కలెక్టర్ రాహుల్ శర్మకు వినతిపత్రం అందజేసి, అక్కడే వేదిక ముందే బైఠాయించారు.
సుమారు గంటపాటు నిరసన తెలిపారు. జయశంకర్ భూపాపల్లి జిల్లా కాటారం, మల్హర్ మండలాలకు చెందిన రైతులకు వానకాలం పంటకు సంబంధించి సుమారు 2 వేల మంది రైతులకు బోనస్ పడకపోవడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి పౌర సరఫరాల సంస్థ అధికారులు, కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇస్తున్న ప్రతిసారీ దాటవేస్తున్నారు.
గ్రామీణ బ్యాంకు విలీనం కారణంగా ఐఎఫ్ఎస్సీ కోడ్ సమస్యతో డబ్బులు పడలేదని అధికారులు చెప్తూ 3 నెలలుగా సమస్యకు పరిష్కారం చూపలేదు. దీంతో సోమవారం సుమారు 70 మంది రైతులు కలెక్టరేట్‌కు చేరుకొని కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసి అక్కడే బైఠాయించారు. బ్యాంకులో ఇతర లావాదేవీలు జరుగుతున్నప్పుడు బోనస్ ఎందుకు పడదని ప్రశ్నించారు. ‘3 నెలలుగా తిరుగుతున్నం.. ఇక మాకు ఓపిక లేదు.. డబ్బులు ఇచ్చేదాక ఇక్కడి నుంచి కదిలేదు’ అంటూ భీష్మించారు.
‘యాసంగి ప్రారంభం కాబోతున్నది. ఇంకా బోనస్ ఎప్పుడిస్తరు? మాలో రాజకీయ నాయకులు ఎవరున్నారు.. చూపండి.. మాకు రాజకీయాలు వద్దు.. డబ్బులు ఇవ్వండి చాలు దండం పెడతాం’ అంటూ రైతులు అభ్యర్థించారు. రాష్ట్రమంతా ఒక రూలు.. కాటారం, మల్హర్ మండలాలకు ఒకరూలా? అని నిలదీశారు. ప్రజావాణి అనంతరం సమస్య పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారంతా బయటికి వచ్చి కలెక్టరేట్ ముందే కూర్చున్నారు. చివరికి వారం రోజుల్లో డబ్బులు పడకపోతే మళ్లీ సోమవారం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళన నిర్వహిస్తామని చెప్పి వెళ్లిపోయారు.