మేళ్లచెర్వు, జూన్ 4 : సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో గురువారం జరిగిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ గ్రామసభలో గందరగోళం నెలకొన్నది. సర్వేనంబర్ 1057లో 185 మంది రైతులకు చెందిన 220 ఎకరాల పట్టాభూమిని నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టారంటూ ఆర్ఐ మోషిన్బాబాతో రైతులు వాదనకు దిగారు. సర్వే నంబర్లో మొత్తం 631 ఎకరాలు ఉండగా అందులో 18.15 ఎకరాల ప్రభుత్వ భూమి, 3.06 ఎకరాల సీలింగ్ భూమి, 156 ఎకరాల భూదాన్ భూమి పోగా దాదాపు 463.02 ఎకరాల పట్టా భూమి ఉన్న, ఇందులో పలువురు రైతుల నుంచి మైహోం సిమెంట్స్ 110 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్టు వారు తెలిపారు.
రైతుల వద్ద మిగిలి ఉన్న 333 ఎకరాల పట్టా భూమిలో 220 ఎకరాలను ఇటీవల నిషేధిత జాబితాలోకి చేర్చినట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఆర్ఐతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయాన్ని ఆర్ఐ ఫోన్ ద్వారా తహసీల్దార్ రాజేందర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామసభకు తహసీల్దార్ ఎందుకు హాజరు కాలేదని రైతులు మండిపడ్డారు. నిషేధిత భూముల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని అధికారులు రైతులను శాంతపరిచారు.