ఇనుగుర్తి, మార్చి 2 : అర్హులైన రైతులకు రైతు భరోసా రాలేదని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్‌ను రైతులు నిలదీశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లక్ష్మీపురంలో ఆదివారం చోటుచేసుకున్నది. ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను స్థానిక రైతులు చుట్టుముట్టారు. తమకు ఇంతవరకు రైతు భరోసా అందలేదని నిలదీశారు. ఒకటి, రెండు ఎకరాల భూమి ఉన్న రైతులకు కేవలం సగం భూమికే రైతు భరోసా అందిందని, మిగతా భూమికి అందలేదని వాపోయారు.
ఎన్నికల ముందు రైతులు, ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నట్టేట ముంచిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీలు పెడుతుందని, ప్రజలను నిండా ముంచుతుందని మండిపడ్డారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు గట్టిగా ఓటుతో బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. దీంతో చేసేదేమీలేక ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.