మెట్పల్లి, అక్టోబర్ 12: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీరుకు నిరసనగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రైతులు కదంతొక్కారు. రైతు వేదిక ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన నిరసన కార్యక్రమానికి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ తీశారు. పట్టణంలోని పాతబస్టాండ్ వద్దకు చేరుకుని జాతీయ రహదారిపై బైఠాయించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని ఎంపీ అర్వింద్ రాసిచ్చిన బాండ్పేపర్తో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పలువురు వేదిక నాయకులు మాట్లాడుతూ.. మూతపడ్డ ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని, ఎంపీ అర్వింద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, మక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నల్లచట్టాలు చేసి రైతుల నడ్డివిరుస్తున్నదని ధ్వజమెత్తారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవో వినోద్‌కుమార్‌కు అందజేశారు.