Runa Mafi | ఆదిలాబాద్ నుంచి జోగులాంబ జిల్లా దాకా సంగారెడ్డి నుంచి కొత్తగూడెం జిల్లా దాకా రైతన్నల నిరసనలతో తెలంగాణ దద్దరిల్లింది. రేవంత్ రుణ మోసంపై రణభేరి మోగించింది. పోయిన ప్రతి జిల్లాలో అక్కడి గుడిలోని దేవుడిపై ఒట్టేసి మరీ చెప్పిన మాఫీని గట్టున పెట్టిన ముఖ్యమంత్రి తీరుపై రైతులోకం భగ్గుమన్నది. ఒకే దఫాలో చేస్తానన్న రుణమాఫీని మూడు దశల కిందికి మార్చినా, ఇవాళ కాకపోతే రేపైనా అవుతుందని పంద్రాగస్టు దాకా ఓపికగా వేచిచూసిన అన్నదాతలు.. ఇది మాఫీ కాదు, మోసమని గుర్తించి ఒక్కసారిగా రోడ్డెక్కారు. ఎక్కడికక్కడ, ఎవరికి వారుగా ముందుకు కదిలా రు. శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనాలు, ధర్నాలు, అధికారుల నిలదీతలు, ఆత్మహత్యాయత్నాలు, రాస్తారోకోలు ఇలా ఎవరికి తోచిన రూపంలో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ సర్కారు చేసిన పాపం చివరికి బ్యాంకుల మెడకు చుట్టుకున్నది. అనేక చోట్ల రైతులు బ్యాంకుల్లోకి చొరబడి మాకెందుకు రుణమాఫీ కాలేదంటూ బ్యాంకర్లను నిలదీశారు. అసలేం జరిగిందో, ఏ ప్రాతిపదికన మాఫీ చేశారో తెలియని బ్యాంకర్లు జవాబు చెప్పలేక, రైతుల్ని ఏమీ అనలేక ఆపసోపాలు పడ్డారు. అనేక చోట్ల రైతులు గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన రుణమాఫీతో ప్రస్తుత పరిస్థితిని పోల్చి మాట్లాడుకున్నారు. ఎవరు, ఏ రైతు, ఎప్పుడు, ఎంత పంట రుణం తీసుకున్నాడన్న వివరాలన్నీ బ్యాంకుల వద్ద సిద్ధంగా ఉండగా రేవంత్ ప్రభుత్వం ఇప్పటికీ సమాచారం సేకరిస్తున్నాం అంటూ సాకులు చెప్తున్నదని వారు ధ్వజమెత్తారు. ఒట్టుదీసి గట్టుమీద పెట్టి మాఫీని ఎగ్గొట్టడమే సీఎం రేవంత్ పని అంటూ తిట్టుకోవడం వినిపించింది.
మరిప్పుడు 2 లక్షల రుణమాఫీకి అంతకంటే తక్కువ మందే ఎలా అర్హులవుతారు? అంతకంటే తక్కువ మొత్తం ఎలా సరిపోతుంది?
“మా రుణం ఎందుకు మాఫీ కాలే.. మాటిచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు చేయలే.. ఇదే సర్కారు.. ఏమి గోస ఇది.. అందరికీ చేసినన్నడు.. అన్నీ చేసినట్టు చెప్పుకున్నరు.. మాకెందుకు గాలే” అని రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అన్నదాతలు శనివారం రోడ్డెక్కారు. వ్యవసాయ రుణాలు తీసుకున్న బ్యాంకుల ఎదుట ఆందోళనలకు దిగారు. ఒక్కో బ్యాంకు పరిధిలో వందలాది మంది రైతుల రుణాలు మాఫీ కాలేదు.
కోట్ల రూపాయల రుణాలు మాఫీ కాలేదు. దీంతో సర్కారు నిర్లక్ష్యాన్ని రైతులు ఎండగట్టారు. పాలకుల పరిహాసాన్ని నిరసించారు. బ్యాంకుల అధికారుల అలసత్వంపై ధ్వజమెత్తారు. మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలంటూ కొర్రీలు పెట్టిన ప్రభుత్వ వైనాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. వెంటనే మాఫీ చేయాలని, లేకుంటే ఉద్యమిస్తామని రైతులు హెచ్చరించారు.
రూ.49,500 కోట్లు ఎస్ఎల్బీసీ లెక్క ప్రకారం మాఫీకి అర్హులైన రైతుల రుణాల మొత్తం
రూ.40,000 కోట్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తొలుత అవసరం అన్న నిధులు
రూ.31,000 కోట్లు ఆ తర్వాత మాఫీ కోసం క్యాబినెట్లో ఫైనల్ చేసిన నిధులు
రూ.26,000 కోట్లు రుణమాఫీకి బడ్జెట్లో పెట్టిన నిధులు
రూ.17,933 కోట్లు చివరికి రుణమాఫీకి వాడిన నిధులు
కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలోని 130 సంఘాలకు చెందిన 96,338 మంది రైతులకు రుణమాఫీ కాగా ఇంకా 36,543 మందికి రూ.421.70 కోట్ల మాఫీ కావాల్సి ఉన్నది.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ ఇండియన్ బ్యాంకులో 1,400 మంది రైతులకు 311 మందికే రుణమాఫీ అయింది.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట కెనరా బ్యాంకులో 2వేల మంది రైతులకు 1,021 మందికే మాఫీ అయింది.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట ఇండియన్ బ్యాంకులో 1,280 మంది రైతులకు 432 మందికే రుణమాఫీ అయింది.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడి మడుగు ఇండియన్ బ్యాంకులో 1,308 మంది రైతులకు 173 మందికే రుణమాఫీ జరిగింది.
దుండిగల్ బ్యాంక్‌లో 632 మందికి కేవలం 14 మంది రైతులకు చెందిన రూ.4.30 లక్షలనే ప్రభుత్వం మాఫీ చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పూర్తిచేశామని చెప్తున్నా రాష్ట్రంలో వేలాదిమంది రైతులు తమకు రుణాలు మాఫీ కాలేదంటూ రోడ్డెక్కారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట కెనరా బ్యాంకు ఎదుట రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులు.
రుణమాఫీ విషయంలో ప్రభుత్వ మోసాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహిస్తున్న రైతులు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
– వేల్పూర్
మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో 2 లక్షల రుణమాఫీ కాలేదంటూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని సీఎం వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ మండల నాయకుడు సింగతి రాంచందర్, రైతులు డిమాండ్ చేశారు.
– నెన్నెల
బ్యాంకు ఖాతా పేరుకు, ఆధార్ కార్డుకు మిస్‌మ్యాచ్ కావడంతో నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు రుణమాఫీ ఆగిపోయింది. దీంతో శనివారం మండలకేంద్రంలోని ఇండియన్ బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టారు.
– నార్కట్‌పల్లి
రైతు రుణమాఫీ కోసం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్‌రోడ్ వద్ద శనివారం నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి వినూత్న నిరసన తెలిపారు. తెలంగాణలోని పలు ఆధ్యాత్మిక క్షేత్రాలకు సంబంధించిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.. పార్లమెంట్ ఎన్నికల సమయంలో సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి ఆయా దేవుళ్లపై ఒట్లు వేసుకుంటూ రైతులను నమ్మించి రుణమాఫీ చేస్తానని అబద్ధపు హామీలు ఇచ్చాడని వేముల గుర్తుచేశారు.
– వేల్పూర్
రుణమాఫీ కాలేదంటూ వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకు ఎదుట రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో రైతులు శనివారం ఆందోళనకు దిగారు. అధికారంలోకి రాగానే షరతులు పెట్టి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు.
– అమరచింత
నేను కవేలి బ్యాంకులో రూ.1.35 అప్పు తీసుకున్నాను. రూ.2 లక్షల వరకు రుణమాఫీ అయ్యిందంటే నేను కూడా బ్యాంకుకు వచ్చాను. కానీ, వారు అతికించిన లిస్టులో నా పేరు లేదు. నాకు రుణమాఫీ ఎందుకు కాలేదో తెలియడం లేదు. ఎవరూ చెప్పడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి?
-సంగయ్య, రైతు, కవేలి గ్రామం, కోహీర్ మండలం(సంగారెడ్డి జిల్లా)
ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చినప్పుడు అందరి ఓట్లు కావాలి కానీ, రుణమాఫీ చేసేటప్పుడు రైతులందరికీ చేయాలనే సోయి లేని ప్రభుత్వం ఇది. శాతగాని మాటలు చెప్పి రైతులను ఆగం చేసుడెందుకు? గతంలో రూ.25 వేల చొప్పున రూ.లక్ష వరకు రుణమాఫీ అయినప్పుడు ఇప్పుడెందుకు కాదు? ఊర్లో 10 మందికి రుణమాఫీ అయితే మిగతావాళ్లు ఎటు పోతరు? ఆ పది మందితోనే ప్రభుత్వానికి అవసరమా? ఊర్లకు వచ్చి వ్యవసాయం చేసేటోళ్లు ఎవలు? చేయనోళ్లు ఎవలు అని చూసి అందరికీ మాఫీ చేయాలె. వ్యవసాయం కోసం బ్యాంకుల్లో రుణాలు, బయట వడ్డీలకు తెచ్చుకొని రెక్కలు పోయేదాక వ్యవసాయం చేసిన చేతికి రూపాయి వత్తలేదాయె. రైతు అనేటోళ్లందరికి మాఫీ చేయాలె.
– ఎల్లావుల విజయ, పంచోత్కులపల్లి, ములుగు మండలం, ములుగు జిల్లా
మా ఊర్లో పావులా వంతు రైతులకూ రుణమాఫీ జరగలేదు. నాకు ఏడెకరాల భూమి ఉంది. నా పేరు మీద రూ.1,95 లక్షలు, నా భార్య పేరు మీద రూ. 2.12 లక్షలు ఉంది. ఏఈవోను అడిగితే ఒకటే రేషన్‌కార్డు మీద ఇద్దరి పేర్లు ఉన్నందున పథకం వర్తించలేదని చెప్పారు. బ్యాంకు అధికారులను అడిగితే రేషన్‌కార్డు నిబంధన ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అని అంటున్నారు. ప్రభుత్వం నుంచి త్వరలో ఉత్తర్వులు వస్తాయని, తొందరపడొద్దని సముదాయిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రూ.లక్ష రుణమాఫీ పొందాను. ఇప్పుడూ అలాగే రుణమాఫీ వర్తింపజేస్తే నాలాంటి ఎంతో మంది రైతులకు మేలు జరుగుతుంది.
– బిక్కినేని మల్హల్రావు, పంచోత్కులపల్లి, ములుగు మండలం, ములుగు జిల్లా
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం జన్నేపల్లిలోనూ సిండికేట్(కెనరా) బ్యాంకు వద్ద రైతులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతన్నలందరికీ రుణమాఫీ చేయాలంటూ డిమాండ్ చేశారు.
– నవీపేట
పంట రుణం తీసుకున్న రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద వివిధ గ్రామాలకు చెందిన రైతులు ధర్నా చేశారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు రైతు వేదికలో వ్యవసాధికారులు, ఏఈవోలు లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
– నర్సింహులపేట
రుణమాఫీ కాలేదని కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లి గ్రామానికి చెందిన రైతులు పెద్దమల్లారెడ్డిలోని రైతువేదికలో ఆందోళన చేపట్టారు. అనంతరం మూకుమ్మడిగా కామారెడ్డిలోని కలెక్టరేట్‌కు తరలివెళ్లారు.
– కామారెడ్డి
రుణ మాఫీ కాలేదంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట, చింతలపేట, మల్లాపూర్ మండలంలోని సాతారం, ధర్మారం, చిట్టాపూర్ గ్రామాల పరిధిలోని రైతులు శనివారం మల్లాపూర్ రైతువేదికలో డీఏవో వాణి, బ్యాంకు అధికారులను నిలదీశారు.
– కరీంనగర్, నమస్తే తెలంగాణ ప్రతినిధి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని పలువురు రైతులు శనివారం రుణమాఫీ అంశంపై ఏవో కార్యాలయ సిబ్బందిని నిలదీశారు. నిరసనగా కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. నిర్లక్ష్యం చూపుతున్న అధికారులు, సిబ్బందిపై చర్య తీసుకోవాలని కోరారు.
– మహదేవపూర్
రుణమాఫీ అయితదని ఎదురు చూసినం. మాకు కాలె. మా ఆయన సదర్లాల్ పేరు మీద రూ.2.02 లక్షల అప్పు ఉన్నది. ఇప్పుడు మాఫీ కాలేదు. పైన రూ.2 వేలు కట్టినా కాదంటున్నరు. రుణమాఫీ వచ్చినోళ్లు నవ్వబట్టె.. రానోళ్లు ఏడ్వబట్టె.. ఎందుకు ఈ దొంగ రాజకీయాలు. పెట్టుబడికే కదా రైతులు అప్పులు తెచ్చేది. దానికి ఇన్ని తాకట్లా. పెట్టుబడికి కొంచెం తోడు అయినట్టు ఉంటదనుకుంటే నాశనం అయిపాయె. రైతలందరికీ కచ్చితంగా రుణమాఫీ చేయాలె.
– భూక్యా యశోద, పంచోత్కులపల్లి, ములుగు మండలం, ములుగు జిల్లా
రుణమాఫీ విషయంలో ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని కప్పర్లలో రైతులు వ్యవసాయ అధికారి శివకుమా ర్ను నిలదీశారు. ఎందుకు రుణమాఫీ చేయలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
– ఆదిలాబాద్
నేను కవేలి బ్యాంకులో రూ.లక్షన్నర అప్పు తీసుకున్నాను. ఇప్పుడు అవి రూ.1.60 లక్షలు అయ్యాయి. రుణమాఫీ అయ్యిందని బ్యాంకుకు వస్తే అందులో నా పేరు లేదు. ఇప్పుడు కాకపోతే రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తరు? నాకు ఎందుకు కాలేదో ఎవరూ కరెక్టుగా చెప్పడం లేదు. బ్యాంకు వాళ్లు, వ్యవసాయ అధికారులు సరైన సమాధానం ఇవ్వడం లేదు.
– లక్ష్మణ్, రైతు, పైడిగుమ్మల్ తండా, కోహీర్ మండలం (సంగారెడ్డి జిల్లా)