నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 24 : రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. పంట చేతికొచ్చి దాదాపు నెల రోజులు కావస్తున్నా చాలాచోట్ల కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, చేసిన చోట కొనుగోళ్లు ప్రారంభించలేదని మండిపడుతున్నారు. సర్కార్ తీరును నిరసిస్తూ శుక్రవారం అనేక జిల్లాల్లో నిరసనలు చేపట్టారు. ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, నిజామాబాద్, నాగర్‌కర్నూల్, గద్వాల, నారాయణపేట తదితర జిల్లాల్లో అన్నదాతలు రోడ్డెక్కారు. ధర్నాలు, రాస్తారోకోతోపాటు ఎమ్మెల్యేలు, అధికారులను నిలదీశారు.
రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెనలో పురుగు మందు డబ్బాలతో రాస్తారోకో చేపట్టారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్‌రావు ఆధ్వర్యంలో సొసైటీ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం ఎర్రగుంట జాతీయ రహదారిపై ధాన్యం పోసి బైఠాయించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబంజర సర్పంచ్ గుగులోత్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గిరిజన రైతులు శుక్రవారం నిరాహార దీక్ష చేపట్టారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని వ్యవసాయ మార్కెట్లో మక్కజొన్న రైతులు మరోసారి రోడ్డెక్కారు. నెల్లికొండ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. అదే దారిలో వచ్చిన నాగర్‌కర్నూల్, అచ్చంపేట ఎమ్మెల్యేలు రాజేశ్‌రెడ్డి, వంశీకృష్టను రైతులు అడ్డుకొని నిలదీశారు. మక్కల ట్రాక్టర్లు పోటెత్తడంతో వరంగల్ జిల్లా నెక్కొండలో శుక్రవారం గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యింది.
వడగండ్ల వానతో పంట నష్టపోయిన తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉప్పల గ్రామానికి చెందిన రైతులు కలెక్టరేట్ వద్ద వరి కొయ్యలతో నిరసన తెలిపారు.