మక్కలు కొనుగోలు చేయాలని, రైతులకు సరిపడా గన్నీ సంచులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పలు ప్రాంతాల్లో రైతులు బుధవారం రోడ్డెక్కారు. మక్కలు, సన్‌ఫ్లవర్ గింజలు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు అంబేదర్ సరిల్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద కూడా వివిధ గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం వీర్లపల్లిలో కేసీఆర్ ప్రభుత్వంలో మూడు వేల మొక్కలతో పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. అవి పెరిగి పెద్దవై వృక్షాలుగా మారడంతో గ్రామంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. అయితే, మూడు రోజుల క్రితం కాంగ్రెస్ నాయకులు కాంప్లెక్స్ నిర్మాణం పేరుతో వాటిని తొలగించి.. ఆ భూమిని చదును చేశారు. దీనిని నిరసిస్తూ వీర్లపల్లి సర్పంచ్ చిందం పాండు, వార్డు సభ్యులు, గ్రామస్తులు బుధవారం కలెక్టరేట్‌తోపాటు నందిగామ ఎంపీడీవో అధికారులకు ఫిర్యాదు చేశారు.