జయశంకర్ భూపాలపల్లి, జూలై 31 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం.. ఇష్టారాజ్యంగా మారితే, అధికారం.. కక్షసాధింపులకు ఆయుధమైతే.. పాలన అరాచకమవుతుంది… ప్రజల బతుకు అగమ్యగోచరమవుతుంది. తెలంగాణలో ఏడాదిన్నరగా కాంగ్రెస్ పాలనలో నిత్యం ఎక్కడో ఓ చోట కూల్చివేతలు జరుగుతూనే ఉ న్నాయి. పేద, బడుగు, బలహీనవర్గాలు, కార్మికులు, కర్షకుల ఆక్రందనలు వినిపిస్తూనే ఉన్నా యి.
ప్రజల సంక్షేమం కోసం పాటుపడాల్సిన పాలకులే.. పెత్తందారీ పోకడలు ప్రదర్శిస్తే.. ప్రజ ల హాహాకారాలే ఆవేశంగా మారుతాయి. అణచివేతకు గురైన బడుగు జీవుల నుంచే తిరుగుబాటు బావుటా ఎగురుతుంది. అందుకే.. ఓపిక నశించిన తెలంగాణ ప్రజానీకం.. ఇప్పుడు తిరగబడుతున్నది. ఇటీవల జరుగుతున్న పలు పరిణామాలు.. నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన రైతన్న నిరసన రూపం… తెలంగాణ ప్రజాగ్రహానికి ప్రతిరూపంగా కనిపిస్తున్నది.
కాంగ్రెస్ పాలనలో కూల్చివేతల పరంపరలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే భూపాలపల్లిలోని మంజూర్‌నగర్‌లో సర్వేనంబర్ 187లో కూరాకుల ఓదెలు, లలిత దంపతులు 30 ఏండ్ల క్రితం భూమి కొనుక్కుని, ఇంటిని నిర్మించుకున్నారు. కూలిపని, పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంటి ముందు గుంటన్నర స్థలంలో బర్రెల కొట్టం కట్టుకున్నారు. ఇంటి పక్కనే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది.
పాఠశాలకు రోడ్డు వేసేందుకు అధికారులు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. ప్రధాన రహదారి నుంచి పాఠశాల వరకు రోడ్డు నిర్మించాల్సి ఉన్నప్పటికీ పాఠశాలను దాటుకుని, తమ ఇంటి వరకు రోడ్డు వేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. గురువారం వీళ్లు కూలిపనికి వెళ్లగా మున్సిపల్ టౌన్ ప్ల్లానింగ్ అధికారి సునీల్.. సిబ్బందితో వెళ్లి కొట్టాన్ని కూల్చివేశారు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కూలిపోయిన కొట్టం, ఆరుబయటనే తిరుగుతున్న మూగజీవాల దుస్థితిని చూసిన ఓదెలు, లలిత… గుండెలవిసేలా రోదించారు.
కానీ.. ఈ ఘోరంపై గళమెత్తాలని నిర్ణయించుకున్నారు. పశువులను తీసుకెళ్లి… ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తోలారు. సుమారు అరగంట పాటు క్యాంపు కార్యాలయంలోనే బర్రెలను మేపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి.. బాధితులతో వాగ్వాదానికి దిగారు. అయినా వారు బయటికి వెళ్లలేదు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓదెలు తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా చూపించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఓదెలు, లలితతో పాటు ఓదెలు బావ మరిదిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మెయిన్ గేట్‌కు తాళం వేశారు. రైతు తిరుగుబాటుతో ఎమ్మెల్యే ఆఫీస్‌కు తాళం వేసుకోవాల్సి రావడం సంచలనంగా మారింది.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తమపై కక్ష కట్టి చాలా రోజుల నుంచి వేధింపులకు గురి చేస్తున్నారని, తమ కొట్టాన్ని తొలిగించాలని చాలాసార్లు అధికారులతో చెప్పించారని బాధితురాలు లలిత ఆరోపించారు. తాము నివసిస్తున్నది ప్రభుత్వ స్థలం కాదని, 30 ఏండ్ల క్రితం సర్వర్ మొయినొద్దీన్ అనే వ్యక్తి దగ్గర కొనుక్కున్నామని తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు క్యాంప్ ఆఫీస్‌లోనే ఉంటామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ నాయకులు ఇష్టారాజ్యంగా భూకబ్జాలు చేసినా పట్టించుకోని మున్సిపల్ అధికారులు.. పట్టా భూమిలో నిర్మించుకున్న పశువుల కొట్టాన్ని కూల్చివేయడం ఏంటని, ఓదెలు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు.