నిజాంసాగర్, ఫిబ్రవరి 26: ఒక పక్క పంటలకు నీరందక నానా ఇబ్బందులు పడుతున్న రైతన్నలకు మరోవైపు అధికారుల వేధింపులు మొదలయ్యాయి. నిజాంసాగర్ ప్రధాన కాలువ నుంచి పొలాలకు నీరందించుకుంటున్న రైతులకు చెందిన మోటర్ల స్టార్టర్లు, ఫ్యూజ్లను అధికారులు తీసుకెళ్లారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్, బాన్సువాడ మండలాల పరిధిలోని రైతులు నిజాంసాగర్ ప్రధాన కాలువలో మోటర్లు ఏర్పాటు చేసుకొని పంట పొలాలకు నీరందిస్తున్నారు.
నిజాంసాగర్ మండలం తుంకిపల్లి తండా, బాన్సువాడ మండలం జేకే తండా శివారుల్లోని మోటర్ల నుంచి స్టార్టర్స్, ఫ్యూజ్లను కొందరు అధికారులు ఎత్తుకెళ్లారు. మూడు గంటల కన్నా ఎక్కువగా మోటర్లను నడుపవద్దంటూ స్టార్టర్లు, ఫ్యూజ్లను ఎత్తుకెళ్లారని రైతులు వాపోయారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాము ఎంతో సంతోషంగా పంటలు పడించుకున్నామని గుర్తుచేసుకుంటూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను అధికారులు అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తమకు న్యాయం చేసి తమ పంటలను కాపాడాలని వేడుకుంటున్నారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన డంపింగ్‌యార్డును వెంటనే రద్దు చేయాలని గుమ్మడిదల, నల్లవల్లి, కొత్తపల్లి గ్రామస్తులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం గుమ్మడిదలలో మహాశివరాత్రి సందర్భంగా రైతు, మహిళా జేఏసీ నాయకులు కళశాలతో శివుడికి అభిషేకాలు చేశారు. 16వ రోజు గుమ్మడిదల మున్సిపాలిటీలో రెడ్డి సంఘం సభ్యులు రిలే దీక్ష చేపట్టారు. దీక్షకు రూ. లక్షన్నర విరాళంగా జేఏసీ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డికి అందజేశారు. నల్లవల్లి, కొత్తపల్లి ప్రజలు 22వ రోజు రిలే దీక్ష చేపట్టారు. మహాశివరాత్రి సందర్భంగా బుగ్గకుంటలోని శివుడికి ఆందోళనకారులు అభిషేకాలు చేశారు. కాంగ్రెస్ సర్కారుకు, సీఎం రేవంత్‌రెడ్డికి బుద్ధి ప్రసాదిచాలంటూ శివుడికి మొక్కుకున్నారు. -గుమ్మడిదల,